ఆధునిక కాలంలో నాగరిక సమాజంలో చాలామంది జీవితాలు బావిలోకప్పలాగా తయారైపోయాయి. టీవీలు మొబైల్ ఫోన్లు ఇలా ఎలక్ట్రానిక్ సాధనాలు చేసిన తర్వాత వాటితోనే కాలం గడపడం సహజమైపోయింది. చిన్న పిల్లలు నుంచి పెద్దలు వరకు వాటికి అలవాటు పడిపోయారు. అడవుల్లో అందమైన పరిసరాలు, చెట్లు, కొండలు, కోనలు, జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా నేటితరం మరిచిపోయింది. అలాంటివి ఇప్పుడు వారికి కొత్తగా అనిపిస్తుంది. ఈ అందమైన పువ్వును చూడండి.. దీని పేరు అల్లిపువ్వు ,లేదా లోకండి పువ్వు, లేదా అంజినీ పువ్వు అంటారు. ఇనుప చెక్కచెట్టు పువ్వు అని కూడా అంటారు.
అద్భుతమైన అందాలతో మనసును రంజింప చేస్తుంది. కనువిందు చేస్తుంది. బహుశా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇలాంటి పూలు చూసే భాగ్యం దక్కదేమో ..? కొండ ప్రాంతాలలో కొండ ప్రాంత గ్రామాల్లో ఇలాంటి పూలు అక్కడక్కడ కనిపిస్తాయి . విశేషమేంటంటే ఈ పువ్వు భారతదేశం లోనే ఎక్కువగా పెరుగుతుంది . ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కాకుండా థాయిలాండ్ మరియు దక్షిణాసియాలోని కొన్ని దేశాల్లో పెరుగుతుంది.
చిన్న పూలతో డార్క్ బ్లూ లేదా పర్పల్ కలర్ తో గుత్తులు , గుత్తులుగా చూసేందుకు మనోహరంగా ఉంటుంది . ఈ పువ్వు ఆ చెట్టు ఆకులు రాలిపోతున్నప్పుడు ఆకుల కేంద్రకం నుంచి ఇలా గుత్తుల గుత్తులుగా వచ్చి అద్భుతమైన రీతిలో కనువిందు చేస్తాయి . సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై లోపల ఈ చెట్టు పూలు పూసి కనులకు పండగ చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టు బెరడు విస్తృతంగా వైద్యానికి పనికొస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మూత్ర సంబంధమైన మంట అలాంటి రుగ్మతలకు ఈ అల్లిపూలు ఉపయోగపడతాయట.

