ఆంధ్రప్రదేశ్లో జనవరి నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలన్న ఆలోచనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం తమదేనంటూ గత ఆరు నెలలుగా చెబుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక సంస్థలు ఎన్నికలను మాత్రం ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరు. పులివెందల ,ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి స్థానికల ఎన్నికల విషయంలో తన ఆలోచనను మార్చుకున్నట్టు ఉన్నారు..
అందుకే ఆయన పదేపదే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కేంద్ర బలగాలతోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు . అలా చేయకపోతే ఈ ఎన్నికలకు అర్థం లేదని, అధికార పార్టీ రిగ్గింగ్ చేసుకుంటుందని కూడా చెప్తున్నారు. ఆయన విమర్శల సంగతి ఎలా ఉన్నా, ఐదేళ్ల జగన్ పాలనలో కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినా దాదాపు 72 శాతం ఏకగ్రీవాలే జరిగాయి. వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. ఆ ఏకగ్రీవాలు కూడా ఎలా జరిగాయి అన్నది అప్పట్లో వాస్తవ పరిస్థితులు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా తెలిసిందే .
ఒంటిమిట్ట ,పులివెందుల జడ్పిటిసి ఎన్నికలు ఆయనను ఆలోచనలో పడి వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ,ప్రజల్లో కానీ తామ అనుకుంటున్నట్టు ఇంకా తమకు పూర్తి అనుకూలత రాలేదన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు గ్రహించారు . కాకపోతే రాజకీయ డాంబికంతో ,రాజకీయంగా ఓటమిని ఒప్పుకోలేని నైజంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం తమదేనంటూ సవాల్ చేస్తున్నారు . అయితే స్థానిక ఎన్నికలు మాత్రం బహిష్కరించేందుకు అంతర్గతంగా ఒక చర్చ జరుగుతుంది.
జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది . అందువల్ల బహుశా జనవరి నెలలో జరిగే స్థానిక ఎన్నికల్లో వైసిపి పాల్గొనే అవకాశం లేదన్నది ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా వైసీపీ నేతలు రాబోయేది తమ ప్రభుత్వం మేనని ,ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా చేస్తాం, ఇలా చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. దాదాపు జగన్మోహన్రెడ్డి అయితే మళ్లీ తామే అధికారంలోకి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు .
ఎన్నికలకు ఇంకా మూడున్నర సంవత్సరాలు వ్యవధి ఉంది . వైసీపీలోని సీనియర్ రాజకీయ వేత్తలకు జగన్ మోహన్ రెడ్డి ధోరణి రుచించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడే వందల కోట్లు ఖర్చుపెట్టి సర్వేలు చేయించి ,తన సొంతంగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకొని వై నాట్ 175 అన్న నినాదాన్ని ప్రబలంగా ప్రచారం చేసి దాదాపు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా చేసుకుని ,పూర్తి విశ్వాసంతో ఉన్న తరుణంలో దారుణ ఓటమి సంభవించింది . అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్లు పెట్టి చేయించిన సర్వేల్లో తేలిందంతా అబద్ధమేనని స్పష్టమైనది. ముఖ్యమంత్రిగా ఉండి కూడాప్రజాభిప్రాయాలపై సరైన నివేదికలు తెప్పించుకోలేని పరిస్థితి అప్పటిది.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ,ఎలాంటి ఉద్యమాలు చేయకుండా, ఎలాంటి ఆందోళనలు చేయకుండా ప్రజా సమస్యలపై నిర్దిష్టమైన ఉద్యమాలు చేపట్టకుండా ప్రజల్లో తిరగకుండా ,రాబోయేది తమ ప్రభుత్వమేనని ,చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందంటూ చెప్పడం వాళ్లకు నచ్చడం లేదు . ఇలాంటి ధోరణి రాజకీయాల్లో పనికిరాదని ఒక రాజకీయ నాయకుడిగా ,ఒక రాజకీయ పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నడపడం లేదన్నది ఆ పార్టీలో రాజకీయ అనుభవం ఉన్నవారు సీనియర్ నాయకులు చెప్పే మాట. కానీ జగన్ లాంటి వ్యక్తికవేవి చెవికెక్కడం లేదు . పూర్తి రాజకీయ అనుభవ శూన్యం గల వ్యక్తులను సలహాదారులుగా పెట్టుకొని వారు చెప్పే మాటలు వింటూ మళ్లీ పాత కోటరీని కొనసాగించుకుంటూ ,వాస్తవ పరిస్థితులను ,క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారన్నది వాళ్ళ ఆలోచన . ఇలాగే ఉంటే తమ పార్టీ పరిస్థితులు పెద్దగా మార్పు రాదని కూడా వాళ్ళు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

