నేటి మానవ జీవనం అస్తవ్యస్తంగా ఉరుకుల పరుగులతో సాగిపోతోంది. పాశ్చాత్య పోకడలతో నవ్యత పేరిట మనిషి జీవన విధానంలో అసంబద్ధత చోటుచేసుకుంది. దీనివల్ల ఆరోగ్యం దూరం అవుతోంది. ఈ నేపథ్యంలో యోగాకు విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించే యోగ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆదరణ పొందుతోంది. యోగ మూలాలన్నీ మన భారతదేశం లోనే ఉన్నాయి. వేద కాలం నుంచే మన దేశంలో యోగా ఉంది.
వేల సంవత్సరాల క్రితం యోగాను పరమేశ్వరుడు సృష్టించినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. భారతీయ తత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను, ప్రాపంచిక దృక్పథాన్ని బోధిస్తుంది. అందుకే యోగాకు సిద్ధాంతాలు, మతాలతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదన మేరకు 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నారు.
ఆ రోజున యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల రోజులపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాంధ్ర పేరుతో కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజైన శనివారం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాల్లో జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు లో జరిగిన యోగా దినోత్సవం విజయవంతమైంది.

