భారతీయ సంతతికి చెందిన వీరప్పన్ అనే ఓ వ్యాపారవేత్త థాయిలాండ్ లోని పట్టాయాలో నిర్మిస్తున్న అతిపెద్ద దేవాలయ సముదాయం ,అద్భుతమైన కళారీతులతో విలసిల్లుతొంది. 1981 నుంచి ఆయన ఈ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఇంకా దాని నిర్మాణం చేస్తూనే ఉన్నారు . ఈ నిర్మాణంలో విశిష్టత , విశేషం ఏమిటంటే ,ఒక్క ఇనుప వస్తువు కూడా వాడకుండా కేవలం కొయ్యలతోనే రాజభవనాలను పోలిన నిర్మాణాలు ,దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇదీ ఈ దేవాలయ సముదాయాల విశిష్టత. థాయిలాండ్ సంప్రదాయం, హిందూ సంస్కృతి, బౌద్ధ మతాచారం ఈ మూడింటి మేళవింపుగా ఈ దేవాలయ నిర్మాణం జరుగుతోంది.
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంగమంగా , వినాయకుడు సముదాయ స్వాగత దేవుడుగా ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు . మరోవైపు బౌద్ధ గురువులు బుద్ధుడి విగ్రహ ప్రధాన కేంద్రంగా కూడా నిర్మాణం జరుగుతుంది.గతించిన థాయిలాండ్ రాజు ప్రతిమలను కూడా అక్కడ ఉంచారు. మరో ఏడాది నాటికి ఈ దేవాలయ నిర్మాణం పూర్తి కావస్తోంది. దేవాలయంలో ప్రతి అంగుళం కూడా తనే దగ్గరుండి వీరప్పన్ పర్యవేక్షణ చేస్తున్నాడు. తన జీవితమంతా ఈ దేవాలయ సముదాయం నిర్మాణానికి వెచ్చించారు . ఈ దేవాలయం నిర్మాణంలో ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా సందర్శకులను అనుమతిస్తున్నారు .
ఈ దేవాలయ సముదాయంలో దేవుళ్ళతోపాటు , గ్రహాల విగ్రహాలను కూడా పెడుతున్నాడు. సూర్యుడు ,చంద్రుడు ,శుక్రుడు , గురువు , బుధుడు, శని ఇలా నవగ్రహాల దేవతలను ,ఊహాచిత్రాలను, ఆ గ్రహాలు ఎలా ఉంటాయి అక్కడ ఉపరితల పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న దాన్ని ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు. ఇది వైజ్ఞానికంగానూ ,ఆధ్యాత్మికంగానూ ,సృష్టిని గురించి తెలుసుకోవాలనుకున్న వారికి ఉపయోగకరంగా దీన్ని మలిచారు.
ఈ దేవాలయ సముదాయంలోని పంచభూతాల పవిత్రత, మానవాళికి పంచభూతాలు వల్ల కలిగే ప్రయోజనాలు ,వాటిని పూజించాల్సిన అవసరాలను కూడా దృశరూపకంగా అద్భుతంగా మలిచారు. ఇలా అన్ని విధాల ఈ దేవాలయ సముదాయాన్ని తీర్చిదిద్దారు .కొయ్యతో చేసిన ఈ నిర్మాణాలు మరో 600 సంవత్సరాలు నాణ్యతతో మన్నికగా ఉంటాయన్నది ఆయన భావన. దీనిలో ప్రధాన భాగం 300 అడుగుల ఎత్తులో 215 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టారు. ఇవి కాకుండా పడవ ప్రయాణాలు ,ఏనుగుల విహారం ,స్పీడ్ బోట్ రైడింగ్, ఇలా రకరకాలైన వాటిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు.

