అదృష్టం.. దురదృష్టం.. వీటిపై ప్రజల్లో చాలా నమ్మకాలు ఉంటాయి. సామాన్య మానవుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వారి వరకూ చాలా మంది ఈ అదృష్టం, దురదృష్టం అనే కాన్సెప్ట్ లను నమ్ముతుంటారు. కొందరైతే తమ దైనందిన జీవనంలో కొన్ని సంఖ్యలను.. అదృష్టసంఖ్యలుగా భావిస్తారు. ఆ సంఖ్యలనే బలంగా నమ్ముతుంటారు. ఫలానా నెంబర్ తన జీవితంలోకి వచ్చాకే.. బాగా కలిసొచ్చిందని అనుకుంటారు. ఒకవేళ ఆ నెంబర్ వచ్చాక కలిసొస్తే.. ఆ తర్వాత ఏ పనిచేసినా అందులో ఆ నెంబర్ ఉండేలా జాగ్రత్త పడతారు.
తాజాగా ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఇలాంటి నమ్మకాలను కలిగి ఉండేవాడు. 1206 అనే సంఖ్యను ఎప్పుడూ తన లక్కీ నంబర్ గా భావించేవారు. రాజకీయాల్లోకి రాకముందు వాడిన స్కూటీ నుంచి ఆయన సీఎంగా పనిచేసేటప్పుడు ఉపయోగించిన కాన్వాయ్ లో వాడే వాహనం వరకూ.. 1206 నెంబర్ ఉండేలా చూసుకునేవారు. తన వ్యక్తిగత వాహనాలను కూడా 1206 నెంబర్ పట్టుబట్టి తీసుకునేవారు.
ఆఖరికి ఇప్పుడు మరణంలోనూ ఆయన 1206 నెంబర్ ను వదల్లేదు. సరిగ్గా 12వ తేదీన 6వ నెలలో ఆయన విమాన ప్రమాదంలో మరణించడం యాధృచ్ఛికమే అయినా.. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ రూపానీ జీవితాంతం లక్కీ నెంబర్ గా భావించిన 1206 నంబరే ఆయనకు దురదృష్ట సంఖ్యగా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

