మన దేశంలోని మహానగరాలలో బ్రతుకు ఎంత దుర్భరమో తెలుసా? పేదల బ్రతుకులైతే చావులు కూడా సమాచారం అందని దౌర్భాగ్య పరిస్థితి . ముంబైలో గత 15 సంవత్సరాలలో రైలు ప్రమాదాలలో చనిపోయిన 14 వేల మంది అభాగ్యులు శవాలను గుర్తు తెలియని మృతదేహాలుగా ప్రకటించి ఖననం చేసేశారు. ఈ 14 వేలమంది మృతులను ఇంతవరకు గుర్తించలేదు . వారి బంధువులు ఎవరో కూడా ఇంతవరకు తెలియదు . ఎవరు విచారణ కూడా చేయలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద దాఖలు చేసిన ఒక పిటిషన్ పై రైల్వే శాఖ ఈ సమాచారం అందించింది.
14 వేల మృతదేహాలు ఆచూకీ తెలియకుండా ఖననం చేసేసారంటే బహుశా ప్రపంచంలో ఇదొక రికార్డ్ . వీటిలో ముంబై లోను మరియు ముంబై పరిసర ప్రాంతాల్లోనూ జరిగిన రైలు ప్రమాదాల్లో మొత్తం 46 వేల 969 మంది చనిపోగా 14,513 మంది ఆచూకీ తెలియక గుర్తుతెలియని శవాలుగా రికార్డ్ చేసేసారు. 2019 నుంచి ఈ గుర్తుతెలియని శవాల సంఖ్య అపరిమితంగా పెరిగిందని కూడా తెలియజేశారు . వీరిని గుర్తించడం చాలా కష్టంగా ఉందని రైలు ప్రమాదాలులో గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయని ,వారి వద్ద ఫోన్లు గాని, ఐడీ కార్డ్స్ గాని లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని రైల్వే పోలీసు చెప్పారు.
రైల్వే పోలీసు కు సోద్ అనే వెబ్సైటు ఉంది. దీనిలో గుర్తుపట్టని మృత దేహాలు ,బంధువులు ఎవరు రాని వారి ఫోటోలను పోస్ట్ చేసి ఉంచుతారు. అయితే ఇప్పుడు ఆ సోత్ వెబ్సైటు లేదు. రైల్వే స్టేషన్లలో ఇతర ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి ఫోటోలు ఉంచి వివరాలు కోసం పెట్టేవారు . అయితే ఈ మృతదేహాలు చూడలేనంతగా భయంకరంగా తయారు కావడంతో ప్రయాణికులు కూడా వాటిని చూడడం లేదు . దీనివల్లనే తమకు వేలల్లో మృతదేహాల ఆచూకీ తెలియని పరిస్థితి ఏర్పడిందని రైల్వే పోలీసులు వివరిస్తున్నారు.

