22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ఈ అద్భుతానికి సమాధానం లేదేమో ?

చిన్న బండపై పెద్ద రాతికొండ.. శ్రీకృష్ణుడు చూపుడు వేలితో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినట్టు పురాణాల్లో చెప్పినట్టు ఉండే కొండ..మాలకొండలో అద్భుతం. ఇది. శతాబ్దాల నుంచి అర్థంకాని మహత్యం.సృష్టిలో సైన్సుకు అంతుబట్టని ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. ఓ చిన్న బండ పై ఎలాంటి ఆధారం లేకుండా పెద్ద కొండ పడిపోకుండా ఉన్న ఉదంతం నెల్లూరు జిల్లాలోని మాలకొండ ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ రాతి కొండ శ్రీకృష్ణుడు తన వేలితో ఎత్తిన గోవర్ధన పర్వతాన్ని పోలి ఉంటుంది. ఈ కొండ కింద భక్తులు విశ్రాంతి తీసుకుంటుంటారు. మరికొందరు భక్తులు ఇక్కడే పొంగళ్ళు వండి స్వామివారికి నైవేద్యంగా పెడుతుంటారు.

Vlcsnap 2025 07 13 17h22m03s586

దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నా, కొన్ని ఆలయాలకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన మాలకొండ కు ప్రత్యేకత ఉంది. దీనినే మాల్యాద్రి అని కూడా అంటారు. కోరి కొలిచే వారికి కొంగుబంగారంగా.. దుష్టశక్తుల పాలిట అరివీర భయంకరుడిగా ఈ స్వామి పూజలందుకుంటున్నారు. నెల్లూరు జిల్లా వలేటి వారి పాలెం మండలం లోని మాలకొండ గ్రామానికి పక్కనే 413 ఎకరాల అటవీ విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి కొండ పూలమాల ఆకారంలో ఉండటంతో ఈ ప్రాంతానికి మాలకొండ అనే పేరు వచ్చిందని చెబుతారు.

Vlcsnap 2025 07 13 17h28m20s803

అగస్త్య మహాముని ఈ కొండ మీద తపమాచరించగా లక్ష్మీ నరసింహుడు జ్వాలా రూపుడై దర్శనమిచ్చాడని పురాణ గాధ. స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండి పోవాలని, దేవతల,ఋషుల దర్శనార్థం వారంలో ఆరు రోజులు, శనివారం మానవులకు కేటాయించాలని అగస్త్య ముని కోరగా.. స్వామి సమ్మతించి విగ్రహ రూపం దాల్చాడని చెబుతారు. అందుకే భక్తులు శనివారం నాడు మాత్రమే స్వామిని దర్శిస్తారు. మిగిలిన ఆరు రోజుల్లో దేవతలు, ఋషులు స్వామి దర్శనం కోసం వచ్చి తమ నృత్య గీతాలతో ఆయనను సేవిస్తుంటారని భక్తుల నమ్మకం.

Vlcsnap 2025 07 13 17h27m55s725

ఈ ఆలయాన్ని వారం రోజులు తెరవాలని ప్రయత్నించి పలు ఇబ్బందులకు గురయ్యారని చెబుతారు. దీంతో శనివారం తప్ప మిగిలిన రోజుల్లో ఆలయ సమీపానికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. ఈ ఆలయానికి నడిచి వెళ్ళేందుకు మెట్ల తో పాటు, వాహనాలు వెళ్లేందుకు కూడా దారి ఏర్పాటు చేసి ఉంది. ఇక్కడకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.ఈ ఆలయం ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటలా 45 నిమిషాల వరకు తెరచి ఉంటుంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.