అంతరిక్షాన్ని అణు సంబంధ విద్యుత్ వినియోగానికి కేంద్రంగా చేయబోతున్నారు .ఇది ఆందోళన కలిగించే విషయం . భూమండలాన్ని అణు ప్రమాదం నుంచి రక్షించమని కోరుకుంటూ ఇప్పుడు చంద్రమండలం పైకి అణు సంబంధ ప్రయోగాలకు రష్యా ,చైనా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నాయి . చంద్రమండలం పైన ఒక మినీ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి . మానవ రహితంగా రోబోట్లు మరియు రిమోట్ కంట్రోల్ సాయంతో ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 2036లో ఇది వినియోగంలోకి వస్తుందని చెప్తున్నారు. అంతరిక్ష ప్రయోగశాలకు అవసరమైన విద్యుత్తును ఈ అణు కేంద్రం సరఫరా చేస్తుంది .
చంద్రమండలం పైన 14 రోజులు చీకటే ఉంటుంది . అందువల్ల సౌర శక్తి ద్వారా ఆ సమయములో అక్కడ విద్యుత్ తయారు చేయడం వీలుకాదు. ఇందుకే చంద్రమండలం మీద అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటివరకు ప్రశాంతంగా, కాలుష్యరహితంగా ఉన్న అంతరిక్షం రాబోయే కాలంలో అణు కేంద్రంగా తయారు కాబోతోంది. మరో వినాశనం అంతరిక్షంలో కూడా చోటు చేసుకునే కాలం వస్తోంది. కొత్త పుంతలు తొ,క్కుతున్న సాంకేతిక రంగం ప్రపంచాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నప్పటికీ, నైతికంగా ,సామాజికంగా , సాంకేతికంగా మరో కోణంలో భావితరాలకు ఒక పెనుముప్పుగా పరిణమిస్తుంది .
అహంకారపూరితంగా కొన్ని దేశాలు అణ్వాయుధాలను సమకూర్చుకోవడం అంతకంటే అహంకారంగా మరికొన్ని దేశాలు పెత్తందారి పోకోడలకు పోవడం వీటన్నింటినీ చూస్తుంటే రాబోయే కాలంలో వీటి పర్యవసానం మానవాళి వినాశనం వైపే దారితీస్తుంది. అడుగంటిపోతున్న సహజ వనరులు, దారి తప్పిన భూగోళం వాతారణం పరిస్థితి ,ఒకవైపు ఉంటే ,మరోవైపు అణ్వాయుధాలను సమకూర్చుకోవడం అనేది ఒక పెద్ద ముప్పుగా పరిణమించింది. పలు దేశాలు కేవలం ఏదో సాకుతోనే యుద్ధాలకు పాల్పడడం ,చివరకు గగనతలాన్ని కూడా యుద్ధరంగంగా మార్చేయడం మానవాళికి రాబోయే కాలంలో సంభవించే పెనుముప్పుని సూచిస్తుంది . ఇటీవల కాలంగా అంతరిక్షం కూడా కలుషితం అయిపోతుంది.. అంతరిక్షంలో ఉపగ్రహ ప్రయోగాల వల్ల క్షిపణుల ప్రయోగాల వల్ల కొన్ని లక్షల టన్నులు చెత్త పేరుకు పోయిందని చెప్తారు.

