అత్తారింట్లో అల్లుడికి మర్యాదలు తగ్గితే గొడవలైపోతాయి.! బలగం సినిమాలో ‘నల్లిబొక్క’ ఎన్ని గొడవలకు దారి తీసిందో చూశాం కదా.! అది తెలంగాణ! కాబట్టి ‘హాట్. మీట్’ గొడవ జరిగింది. మనది రాయలసీమ.! ఇక్కడ ‘స్వీట్’ హీట్ పెంచి. పంచాయితీ పోలీసుల దాకా వెళ్లింది. పెద్దల్లుడు, రెండో అల్లుడికి కజ్జీకాయలు పెట్టిన అత్తింటివారు, చిన్నల్లుడిని చిన్నచూపు చూశారు. దీంతో ఆయనకు మండిపోయింది. గొడవకు దిగాడు. సర్దిచెప్పినా వినలేదు. దీంతో అల్లుడిని అదుపు చేసేందుకు అత్త డయల్ 100కు ఫోన్ చేసింది.
ఉరవకొండలో గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో సుమారు వారం నుంచి సందడి నెలకొంది. స్థానికులు తమ సమీప బంధువులను, కూతుళ్లు, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, మర్యాదలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటికి ముగ్గురు అల్లుళ్లు వచ్చారు. వారిలో చిన్నల్లుడు మినహా.. మిగిలిన ఇద్దరికి అత్తింటివారు కాస్త ఎక్కువ మర్యాద చేశారు. దీంతో ఆగ్రహించిన చిన్నల్లుడు, గొడవకు దిగాడు. ఆ ఇంట్లోవారు సర్దిచెప్పినా తగ్గలేదు. చేసేదిలేక డయల్ 100కు ఫోన్ చేసిన అత్త, తమ చిన్నల్లుడి అల్లరి గురించి ఫిర్యాదు చేశారు.
కంట్రోల్ రూం నుంచి స్థానిక పోలీసులకు సమాచారం రావడంతో, ఓ కానిస్టేబుల్ ఆ ఇంటికి వెళ్లారు. విషయం ఏమిటి అని చిన్నల్లుడిని ప్రశ్నించగా, ‘చూడండి సార్.పెద్దల్లుళ్లకు కజ్జికాయలు పెట్టారు. నాకు మాత్రం పెట్టడం లేదు. ఇదేం మర్యాద.? మీరే న్యాయం చెప్పండి.. అని తనకు జరిగిన అమర్యాద గురించి వివరించాడు. దీంతో ఆ కానిస్టేబుల్ బుర్ర గిర్రున తిరిగింది. ఇన్నాళ్లూ క్రైం థ్రిల్లర్‌లు చూసిన ఆయనకు, ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా కొత్తగా అనిపించింది. విధి నిర్వహణలో భాగంగా, అత్తారింటివారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ముగ్గురు అల్లుళ్లను సమానంగా చూడాలి కదా అని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

