కాగితం పూలు చాలా అందంగా ఉంటాయి.. కెంపు, తెలుపు, పసుపు, ఎరుపు వంటి వివిధ రంగుల్లో కనిపిస్తుంటాయి. ఈ పూలను చూస్తే ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈ పూలను ఇంగ్లీషులో బోగన్ విల్లియ అంటారు. ఈ చెట్లకు ముళ్ళు ఉండటంతో పశువులు సైతం వీటికి హాని చేయలేవు. ఇవి కొన్ని గుత్తులుగా పూస్తే, మరికొన్ని విడివిడిగా పూస్తాయి.
ఈ పూలకు వాసన లేకపోయినా మనోల్లాసం కలిగిస్తాయి. ఈ పూలు చాలా తేలికగా ఉండి ఎక్కువ రోజులు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.పార్కుల్లోనూ, గ్రామాల్లోనూ, పెద్ద పెద్ద భవనాల ముందు, రహదారుల డివైడర్ లలో కాగితం పూల మొక్కలను ఎక్కువగా పెంచుతారు.
ఉన్నప్పుడు పొదుపు చేసుకుని, లేనప్పుడు వాటిని వాడుకోవాలనే జీవిత సత్యాన్ని ఈ మొక్కలు నేర్పిస్తాయి. వర్షాకాలంలో నీటిని పొదుపు చేసుకుంటాయి. అందుకే వర్షాకాలంలో పూలకాపు తక్కువగా ఉంటుంది. వేసవి, శీతాకాలాల్లో దాచుకున్న నీటిని ఈ మొక్కలు పూలకు అందిస్తాయి. అందుకే ఈ సమయాల్లో చెట్టు నిండా పువ్వులు కనిపిస్తూ.. కనువిందు చేస్తుంటాయి.

