ఏనుగుల దంతాలు, తొండం విషయంలో ఆఫ్రికన్ ఏనుగులకు, మన దేశంలో ఏనుగులకు చాలా తేడా ఉంది. ఏనుగు తొండం 40 వేల కండరాలతో పటిష్టంగా ఉంటుంది. ఇది ఆఫ్రికన్ ఏనుగులకు అయితే తొమ్మిది నుంచి పది అడుగులు, భారతదేశంలోని ఏనుగులకు అయితే గరిష్టంగా ఏడు అడుగుల పొడవు ఉంటుంది. ఏనుగులు ఒక్కసారిగా ఎనిమిదిన్నర లీటర్ల నీటిని పీల్చి తొండంలో ఉంచగలవు. ఏనుగులు ఈ తొండంతోనే వాసన చూడగలవు. నీరు, ఆహారాన్ని నోటికి అందించగల ఏకైక సాధనం ఇదొక్కటే.
ఒక్కసారిగా 500 కిలోల బరువు అవలీలగా ఎత్తగలదు. దాని తొండంలో వున్న 40 వేలకండరాలు నిర్మాణం వల్లనే ఏనుగులకు అంత శక్తి వచ్చింది. ఏనుగుల తొండం చివర వేలు లాంటి ఒక నిర్మాణం ఉంటుంది. దీనితోనే అది మొదట వస్తువును పట్టుకుంటుంది. అదే ముఖ్యమైనది. ఆసియన్ ఏనుగులకు అయితే ఒకటి, ఆఫ్రికన్ ఏనుగులకు అయితే తొండం చివర పొడుచుకు వచ్చినట్టు రెండు కండరాల వేళ్లుంటాయి , ఏనుగుల్లో భారతీయ ఏనుగులకు అయితే ఆరు నుంచి ఏడు అడుగుల దంతాలు, ఆఫ్రికన్ ఏనుగులకు అయితే గరిష్టంగా 11 అడుగులు దంతాలు ఉంటాయి.

