రాజకీయానికి బంధుత్వం లేదు. రాజకీయం అత్యంత క్రూరమైనది. కుటుంబాలను కూడా చీల్చేస్తుంది, తోబుట్టువుల్ని శుత్రవుల్ని చేస్తుంది. కేసీఆర్ కుటుంబం, జగన్ కుటుంబమే ఇందుకు నిదర్శనం. జగన్ ఫ్యామిలిలో అయితే ఈ చిచ్చు హత్యలకు, ఆస్తులకు, కేసులకు , కక్షలకు ఆజ్యంపోసింది. కేసీఆర్ కుటుంబం కథ రాజకీయ వెండితెరపై చూడాల్సిందే. రెండు రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీల కుటుంబాల్లో చిచ్చు ఇందుకు నిదర్శనం.కవిత ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణం కుటుంబంలో.. పార్టీలో ఆమెపై జరిగిన వివక్ష. తనకు జరిగిన అవమానాలను చెప్పుకోలేనని కవిత అన్నారు.
కచ్చితంగా ఇలాంటి వివక్షే తెగదెంపులకు కారణం అవుతుంది.కల్వకుంట్ల కుటుంబంలో అదే జరిగింది. ఇలాంటివి జరగకపోతే.. అంతా సాఫీగా సాగిపోతుంది. కుటుంబపెద్ద కొంత మందికి ప్రాధాన్యత ఇచ్చి.. మరికొంత మందికి తక్కువ ప్రాధాన్యత ఇస్తే . తక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వారికి ఎక్కువ కోపం వస్తుంది. సొంత తండ్రిని కలవడానికి వేరే వాళ్లు ఆంక్షలు పెడితే కవితకు ఎలా ఉంటుంది?. తన తండ్రి తనను కాకుండా తనపై కుట్రలు చేశారని అనుమానిస్తున్న వారిని ప్రోత్సహిస్తూంటే ఏ కుమార్తెకైనా ఎలా ఉంటుంది..?. కవితకూ అదే అసంతృప్తి . అందుకే తిరుగుబాటు ప్రకటించారు.
ఫలితంగా కవిత తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గ పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఇది ఆరంభం మాత్రమే. కానీ కవిత పేల్చింది డైనమేట్. బీఆర్ఎస్ పార్టీలో ఎంత మేర పగుళ్లు వచ్చాయో అంచనా వేయడం కష్టం. హరీష్ రావు, సంతోష్ రావుపై ఇప్పటి వరకూ పార్టీలో ఉన్న అంతర్గత అసంతృప్తి బయటకు వచ్చింది. కవితతో వెళ్లకపోయినా చాలా మంది ఈ ఇద్దరి నేతలపై నమ్మకం ఉంచుకునే అవకాశం ఉండదు. ఎలా చూసినా వీరిద్దరు ఇప్పుడు అగ్నిపరీక్షను ఎదుర్కొంటారు. ఎలాంటిదంటే.. ఏం చేసినా కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారా అన్న అనుమానాలు వచ్చేలా శల్యపరీక్ష జరుగుతుంది. దాన్ని వారు తట్టుకోవడం అంత తేలిక కాదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజు అని జగన్.. నివాళి అర్పించడానికి పులివెందులకు వెళ్లారు. అక్కడ ఆయన తల్లిని ఏ మాత్రం ఆదరించని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసి రాజకీయం ఇంత రాక్షసంగా ఉంటుందా అని అనుకున్నారు. ఎందుకంటే తల్లిని రాజకీయాల్లోకి తెచ్చింది జగన్. తండ్రి చనిపోవడంతో ఆ సానుభూతిని గరిష్టంగా వాడుకోవడానికి తల్లిని గౌరవాధ్యక్షురాలిగా పార్టీని పెట్టారు. ఆమెను ఎమ్మెల్యేను చేసి అసెంబ్లీలో నానా మాటలనిపించారు. తర్వాత గెలిచే చాన్స్ లేని విశాఖ నుంచి పోటీ చేయించి పడిపోయేలా చేశారు. నిజంగా తల్లిని పార్లమెంట్ కు పంపాలని అనుకుంటే కడప నుంచే పోటీ చేయించేవారు. కానీ ఆ సీటును అవినాష్ రెడ్డికి ఇచ్చి విజయమ్మను ఓడిపోయే సీటులో నిలబెట్టారు. ఆ తర్వాత చెల్లి షర్మిలను వదిలి పెట్టలేదు.
నిజానికి షర్మిల రాజకీయ ప్రాధాన్యం కోరుకోలేదు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆస్తులను మాత్రమే పంచమని కోరారు. కానీ అక్కడ ధన దాహంతో జగన్ మోసం చేయడంతో షర్మిలకు మరో దారి లేక రాజకీయాల్లోకి వచ్చారు. దిగిన తర్వాత ఇక చలి ఎందుకని ఏపీలోకి వచ్చేశారు. కుమారుడు చేసిన అవమానాలను తట్టుకోలేని విజయమ్మ ఇప్పుడు కుమార్తె వద్దనే ఉంటున్నారు. వారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి .. గతంలో రాసిచ్చిన ఆస్తుల్ని కూడా ఎన్సీఎల్టీకి వెళ్లి మళ్లీ తనకే వచ్చేలా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆస్తుల్ని లాగేసుకున్నందుకు ఆయన పార్టీ చేసుకున్నారు. అలాంటి వ్యక్తి కుటుంబ పెద్దగా ఉంటే.. రాజకీయం ఇంకా ఎంత రాక్షసంగా మారుతుందో చెప్పాల్సిన పని లేదు. విజయమ్మ, షర్మిలకు ఎదురైన అనుభవాలే సాక్ష్యాలు ఉంటాయి.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

