పాస్టర్ ప్రవీణ్ మృతి పై ఆరోపణలు, అనుమానాలు సందేహాలు కొనసాగుతుండగానే ప్రవీణ్ భార్య, సోదరుడు ఇచ్చిన ప్రకటనలతో అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్లకు చెంపపెట్టు అయింది. దీన్ని రాజకీయాలకు వాడుకోవద్దని, తమకు సంబంధంలేకుండా , ప్రకటనలు ఇచ్చి ,నిజానిజాలను పట్టించుకోకుండా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్న తరుణంలో ప్రవీణ్ భార్య జెస్సికా ప్రవీణ్, సోదరుడు కిరణ్ ఓ వీడియో విడుదల చేశారు. ప్రవీణ్ మరణం పై ప్రభుత్వం చేస్తున్న విచారణ దర్యాప్తుపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అందువల్ల ఈ పరిస్థితుల్లో ఎవరు ఆ దర్యాప్తును ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించవద్దని కోరింది .
తన భర్త ప్రవీణ్ నూరు శాతం క్రైస్తవ మత ప్రబోధకుడైనప్పటికీ ప్రజల మధ్య సామరస్యం ,సహనం, ప్రేమ ,కరుణ ఇవన్నీ ఉండాలని కోరుకునే వ్యక్తని చెప్పింది. అందువల్ల ఆ మరణాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి ఉద్రిక్తతలు ,రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోరింది . తనకు ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని, అందువల్ల అందరూ కూడా సంయమనం పాటించాలని, క్రైస్తవ సమాజం మద్దతు తనకు ఇచ్చినందుకు తాను కృతజ్ఞురాలుగా ఉంటానని చెప్పింది . ఈ విషయంలో వేరే ఇతరత్రా కార్యక్రమాలను అనుమతించవద్దని కోరుతూ , క్రీస్తు ప్రభువు సేవకు తన భర్త అంకితమయ్యాడని ఆయన ప్రబోధనలే మార్గంగా తాము నడుస్తామని చెప్పింది.

