మన దేశంలో ప్రజాసేవ చేసే నాయకులు చాలా మందే ఉన్నారు. అందరూ ప్రజల కోసం పని చేస్తున్నామని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నిద్ర లేచింది మొదలుకొని.. మీడియా ముందుకొచ్చి.. అసలు తాము పుట్టిందే ప్రజల కోసం అన్నట్టుగా ఉపన్యాసాలు కూడా దంచేస్తుంటారు. అయితే ఇంతగా మనకోసం తాపత్రయపడే ఆ నేతలు.. ప్రజాసేవ కోసం ఎంత జీతంగా తీసుకుంటున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మన ఎంపీలకు ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
మన ఎంపీల కోసం దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో కొత్తగా 184 ఫ్లాట్లతో కూడిన టైప్ VII అపార్ట్మెంట్స్ నిర్మించారు. ప్రధాని మోడీ వీటిని ప్రారంభించారు. ఢిల్లీలో ఉండేందుకు చోటులేక ఎంపీలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారు. అత్యాధునిక వసతులతో, పర్యావరణ హితంగా ఈ భవనాలను తీర్చిదిద్దారు. ప్రతి ఫ్లాట్ దాదాపు ఐదు వేల చదరపు అడుగుల ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. అంటే మన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఐదు రెట్లు పెద్దది. ఈ కొత్త ఇళ్లలోనే ఇకపై మన ఎంపీలు నివాసం ఉండబోతున్నారు. ఒకవేళ ఇక్కడ అపార్ట్మెంట్స్ వద్దనుకుంటే.. బయట నివసించేందుకు రెండు లక్షలు బాడుగ ఇస్తారు.
ఇళ్ళ సంగతి పక్కన పెట్టి.. వారి జీతభత్యాలు తెలుసుకుంటే మనకి దిమ్మతిరిగి పోవడం ఖాయం.. ప్రజాసేవ చేసుకునేందుకు పాపం మన ఎంపీలు లక్షా 24 వేలు జీతంగా తీసుకుంటారు.. దీంతో పాటుగా రోజుకి 2500 రూపాయలు అలవెన్సు ఉంటుంది.. నెలకు 70 వేల రూపాయలు నియోజకవర్గ పర్యటనలకు ఖర్చు పెట్టుకోవచ్చు.. ఆఫీస్ నిర్వహణకు అదనంగా 60 వేలు కూడా ఇస్తారు. మనకి ప్రజా సేవ చేసి చేసి.. అలసిపోయి రిటైర్ అయ్యాక కూడా పెన్షన్ రూపంలో 31 వేలు పొందుతారు. ఈ పెన్షన్ కూడా ఐదేళ్లకు ఓసారి పెరుగుతూ ఉంటుంది. ఐదేళ్లు పదవిలో ఉంటే 2500 పెన్షన్ పెరుగుతుంది. ఇలా ఎన్నిపర్యాయాలు పనిచేస్తే అన్ని 2500 రూపాయలు పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది.
వీటితో పాటుగా 34 సార్లు విమాన ప్రయాణాలు ఉచితం.. రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణం.. కరెంటు 50 వేల యూనిట్స్ ఏడాదికి ఉచితం.. హెల్త్ పాడైతే ప్రభుత్వమే ఆ పూర్తి ఖర్చు భరిస్తుంది. జీతంపై ఇన్కమ్ టాక్స్ కూడా లేదు.. ఇలా ఎన్నో సదుపాయాలు మన ఎంపీలు ప్రజాసేవ చేసినందుకు అందుకుంటున్నారు.

