ఓ 85 ఏళ్ల పేద వృద్ధుడి నిశ్శబ్ద ఉద్యమం మనకోసం, మన బిడ్డల కోసం, భావితరాల శ్రేయస్సు కోసం , పర్యావరణం ,పరిరక్షణ మొక్కల పెంపకం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు చేసి, గంట తర్వాత ఆ ప్రయత్నాలను గాలికి వదిలేసే ఎవరైనా సరే ఈ వృద్ధుడిని చూసి నేర్చుకోవాలి . ఇంకా చెప్పాలంటే బుద్ధి తెచ్చుకోవాలి. ఇతడు చేపట్టిన కార్యక్రమం మహోన్నతమైనది .నడవలేని వయసులో, వంగిన నడుముతో, కర్ర సాయంతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే ఒక్కడుగా ఇతడు చేస్తున్న పని ఏమిటో తెలుసా..?
పంటకాలువ గట్టుపై ఉన్న చెత్తాచెదారం తొలగించి మొక్కలు నాటడం, వాటికి రోజూ నీళ్లు పోయడం, వాటికి చుట్టూ కంచె వేసి సంరక్షించడం. ప్రతిచెట్టూ ఒక్కో దేవుడు పేరుతో వేస్తాడు. పండ్ల చెట్లు, పూలచెట్లు ఇలా అనేకరకాల చెట్లు వేసి పెంచుతున్నాడు. ఒక్కడుగానే ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి , 12 గంటలవరకు పనిచేసి ఇంటికెళతాడు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు అడ్డుగా ఉందని ఓ జమ్మి చెట్టుని కొట్టేయడం ఆ వృద్ధుడిని బాగా కలచి వేసింది.
ఆ వృద్ధుడికి గంగమ్మ తల్లి కలలో కనిపించి ఫలానా చోట జమ్మి మొక్క ఉందని, దాన్ని కాపాడమని కోరింది. దీంతో ఆ వృద్ధుడు జమ్మి మొక్కను గుర్తించి నీళ్లు పోస్తూ పెంచసాగాడు.అదే స్ఫూర్తితో దేవుళ్ళ పేరుతో మరికొన్ని మొక్కలను నాటి సంరక్షిస్తున్నాడు. పంట కాలువ పొడుగునా వివిధ రకాల పండ్ల, పూల మొక్కలు నాటి ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ఉదంతం నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని టైలర్స్ కాలనీ సమీపంలో నెలకొంది.

