నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో మేయర్ స్రవంతి దంపతులు భేటీ కావడంతో కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వెంటనే మేయర్ స్రవంతిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను కూడా ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. నేల్లూరులో ఇంత జరుగుతున్నా.. మీరేం చేస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక జిల్లాల్లో వైసీపీ హయాంలో పదవిలో ఉన్నవారిపై అవిశ్వాస తీర్మానాలు పెట్టి.. పదవి నుంచి దించేశారు. కూటమి ప్రభుత్వ నేతలకు ఆ పదవులను కట్టబెట్టారు. అయితే నెల్లూరులో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహారం నడిచింది. ఏడాదిన్నర కాలం గడిచిపోయినా నెల్లూరు మేయర్ స్రవంతిని మాత్రం తొలగించలేదు. ఆమెను పదవినుంచి తొలగించేందుకు కనీసం ఎవరూ ప్రయత్నించలేదు. మేయర్ కూడా వైసీపీ నేతలతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ.. కూటమి ప్రభుత్వానికి సహకరిస్తూ.. కార్పొరేషన్ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ వచ్చారు.
అయితే ఇప్పుడు ఏమైయిందో తెలీదు గానీ ఈ ఉదయం వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటుగా రహస్యంగా చర్చలు కూడా జరిపారు. ఈ విషయం కూటమి ప్రభుత్వ పెద్దలకు క్షణాల్లో తెలిసిపోయింది. వెంటనే అప్రమత్తమైన టీడీపీ ప్రభుత్వం.. ఇక అసలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. నవంబర్ లోపుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. మేయర్ ను దించేయాలని నిర్ణయించారని తెలిసింది.

