నెల్లూరు జిల్లా రాజకీయాలలో సోమవారం నాటి సంఘటన ఒక సంచలనం అయింది. వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటి మీద నెల్లూరులో గత రాత్రి దుండగులు దాడి చేసి రెండంతస్తుల్లో ఇంటి సామాగ్రి మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఇంటి గేటు దగ్గర నుంచి పైన బెడ్ రూములు , బాత్రూం, వంటిల్లు వరకు దేనిని వదలకుండా మొత్తం ధ్వంసం చేసి కొన్ని వస్తువులు తగలబెట్టి వెళ్ళిపోయారు. దాదాపు 50 నుంచి 60 మంది రాత్రి 8 గంటల సమయంలో ఇంటి మీద దాడి చేసి 20 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్లిపోయారని తెలిసింది. ఇలాంటి సంఘటన జరగడం నెల్లూరు జిల్లా చరిత్రలో ఇదే ప్రథమం.
ఈ సంఘటనకి మూల కారణం కోవూరులో వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, తన ప్రత్యర్ధి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు. ఇటీవల కాలంగా ప్రశాంత్ రెడ్డికి, వైసిపి నాయకుడైన ప్రసన్న రెడ్డికి మాటల యుద్ధం జరుగుతోంది. ఈ మాటల యుద్ధం వికటించి వ్యక్తిత్వ హననానికి కూడా కారణమైంది. కోవూరులో నిన్న జరిగిన సమావేశంలో ప్రసన్న రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి పై అనేక విధాలైన నిందారోపణలు చేస్తూ ఆమె తన భర్తను ఆస్తి కోసం చంపించాలని ప్రయత్నం చేస్తుందని, ఇందుకోసం రెండు సిట్టింగ్ లు కూడా అయిపోయాయని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి తన ప్రాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెబుతూ కొన్ని తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం ముగిసిన మూడు గంటల్లోపే అత్యంత పగడ్బందీగా ప్రణాళిక ప్రకారం ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడిపై వైసీపీ వర్గాలు నేరుగా ఎంపీ, ఎమ్మెల్యే దంపతులను టార్గెట్ చేసుకొని మాట్లాడుతుండగా, వేమిరెడ్డి అనుకూల టిడిపి వర్గాలు మాత్రం ఇదేదో సింపతి కోసం వాడిన డ్రామా అని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. నెల్లూరు జిల్లా రాజకీయాలలో రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే దురాచారాలు ఎప్పుడు కూడా లేవు. సంసారాల్లో కలతల రేపే మాటలు కూడా ఎప్పుడు ఉండవు. రాజకీయంగా బద్ద శత్రువులైనా, వ్యక్తిగత వివాదాలు జోలికి పోవడం, జీవితాల్లోకి తొంగి చేసే అలవాటు లేదు. అలాగే ఎంత తీవ్రమైన రాజకీయ విమర్శలు చేసుకున్నప్పటికీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే సందర్భం అసలు లేదు. కక్ష సాధింపు చర్యలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాజకీయ చరిత్రలో కూడా ఎప్పుడూ లేరు. ఈ దురాచారం దుర్మార్గం గత ఐదేళ్లుగా సాగుతోంది. అది ఇప్పుడు కూడా కొనసాగడం జిల్లా ప్రజలకు జిల్లా రాజకీయాలకు మంచిది కాదు.
వ్యక్తిగతంగా ఇలాంటి పనులు, ఇలాంటి కక్ష సాధింపు దాడులు ఇప్పటికైనా ఆపగలిగితే రాజకీయాల్లో నెల్లూరు జిల్లా పూర్వవైభవాన్ని గత సాంప్రదాయాలను మళ్ళీ మొదలుపెట్టిన వారవుతారు. లేదంటే ఇది ఫ్యాక్షనిస్టు జిల్లాల కంటే దరిద్రంగా, దారుణంగా, హింసాత్మకంగా తయారయ్యే ప్రమాదం ఉంది. అలాగే నేతలు కూడా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే దురాచారాలు, సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడే దుష్ట సంస్కృతిని విడనాడితే మంచిది.

