పచ్చదనం జీవితాన్ని నందనవనం చేస్తుందా..? పచ్చదనం మనిషి ఆరోగ్యాన్ని , జీవన ప్రమాణాన్ని, జీవితంలో నాణ్యతను పెంచుతుందా..? అనుమానం ఎందుకు..? పురాతన కాలం నుంచే కాదు , శాస్త్రీయంగా కూడా ఇది నూటికి నూరుపాళ్ళు నిజమని తేలింది. పచ్చదనం మనిషిని భౌతికంగానూ, మానసికంగానూ ఉత్సాహపరుస్తుంది. నిత్య నూతన ఉత్సాహంతో ఉంచుతుంది. స్వచ్ఛమైన గాలి, అంతకంటే స్వచ్ఛమైన నీరు, ఒత్తిడి లేని జీవితం.. ఇవన్నీ కూడా పచ్చదనం మధ్యనే వస్తాయి. అంటే పచ్చటి పొలాల మధ్య సమృద్ధిగా సమకూరుతాయి. అక్కడే సంఘజీవనం, సహజీవనం, శారీరిక శ్రమ .. ఇవన్నీ కూడా పొలాల్లోనే కలిసి వస్తాయి. అందుకే ప్రకృతితో కలిసి, ప్రకృతిలో కలిసిపోయే మనిషి ఆయురారోగ్యాలతో జీవించగలరు.
చెట్లు మొక్కలు ప్రకృతి సిద్ధమైన ఎయిర్ ఫిల్టర్స్. అంటే గాలిలోని ప్రమాదకర రసాయనాలను అవి పీల్చుకొని ఆక్సిజన్ వదిలిపెడతాయి. అందువల్ల స్వచ్ఛమైన గాలి పచ్చదనం మధ్యనే లభిస్తుంది. పచ్చదనం మధ్య ఉన్నప్పుడుపచ్చదనం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పచ్చదనం రక్తపోటును కూడా తగ్గిస్తూ కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. టైప్ టు డయాబెటిస్కూడా ఇది బాగా తగ్గిస్తుంది. పచ్చటి ప్రకృతి మధ్య పొలాల మధ్య సమయం గడపగలిగితే మానసిక ఒత్తిడి తగ్గి హార్మోన్స్ సమతుల్యత కొనసాగుతోంది. అందువల్ల మనిషి కొన్ని ఒత్తిళ్లు నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యంగా తయారవుతారు.
మానసిక ఆందోళన లేకపోవడమే ఆరోగ్యం. అలాంటి ఆందోళన ప్రకృతిలో పచ్చదనం తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. పచ్చటి పొలాలు మధ్య మనుషులతో కలిసి ఉన్నా, ఒంటరిగా ఉన్న ఎలా ఉన్నా సరే ఆ వాతావరణం ప్రశాంతతను సమకూరుస్తుంది. ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందుకే పట్టణాలు అభివృద్ధి చెందుతున్న కాలం నుంచి పార్కులను వాటికి సమాంతరంగా అభివృద్ధి చేయడం ప్రారంభించారు. అయితే దురదృష్టం గత కాలం నాటి జ్ఞానం అనుభవాలు నేటి కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. పట్టణీకరణ ఎంత వేగంగా జరుగుతుందో పార్కుల వినాశనం కూడా అంతే వేగంగా జరిగిపోతుంది. దానిఫలితమే లోకం జబ్బుల మయం అయింది.

