పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారనున్నాడా..? పవన్ కళ్యాణ్ కి తలనొప్పి , చీకాకులు తీసుకొస్తాడా..? అనవసరమైన వ్యాఖ్యలు చేయడంలో నాగబాబు మొనగాడే. జనసేన అనే పార్టీ పవన్ కళ్యాణ్ రెక్కల కష్టం.. అభిమానుల చెమట నుంచి తడిచి గట్టిపడుతున్న పార్టీ. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కోపైలెట్ పాత్ర నిజంగా ప్రశంసనీయమే. ఆయన తన పని తానుచేసుకుపోతున్నాడు. ప్రభుత్వానికి ఒక బలమైన ఊతంగా ఉంటున్నాడు. దానిలో ఎటువంటి సందేహం లేదు.
అయితే నాగబాబు వ్యవహార శైలి దానికి పూరిగా విరుద్ధం. నిజం చెప్పాలంటే ఆయన రాజకీయాలపై పరిజ్ఞానం తక్కువ. సామాజికపరిస్థితులపై అవగాహన లేదన్నది ఆయన అభిమానులు ఒప్పుకోకపోవచ్చుగానీ అది నిజం. పిఠాపురం జనసభలోనేకాదు , గతంలో పలుదఫాలు పరిపక్వతలేని వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. పవన్ కళ్యాణ్ వత్తిడితో ఆయనకు ఎమ్మెల్సీగానూ , మంత్రిగానూ స్థానం కల్పిస్తారు. అయితే ఆయన ధోరణి మార్చుకోకపోతే అదే కూటమి ప్రభుత్వంలో తలనొప్పులకు , చీకాకులకు కారణం కాబోతుందని రాజకీయ పరిశీలకుల భావన.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ తన సహజసిద్ధమైన ఆవేశాన్ని అణుచుకుని , పనిలో రాటుదేలారు. అయితే నాగబాబు విషయంలో అది సాధ్యమా , కాదా అన్నదే ఇప్పుడు సమస్య. సహజంగా మల్లెపూవు కట్టిన నారకు ఆ వాసన సోకుతుంది అన్నట్టు , నాగబాబుకు స్వతహాగా ఫాలోయింగ్ లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరుడుగానే ఆయనకు పేరుంది తప్ప , సోదరులమాదిరి అది స్వతసిద్ధంగా వచ్చింది కాదు. పదవి కూడా పవన్ కళ్యాణ్ సిఫార్సుతోనే వచ్చింది. అయితే నాగబాబు తన వ్యాఖ్యలు , వైఖరి మార్చుకోకపోతే కూటమి ప్రభుత్వంలో కలతలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

