భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించింది. ఆగస్టు 27, 2025 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ పిడుగులాంటి వార్తతో భారత ఎగుమతి రంగాలు కుదేలయ్యాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనడమే అమెరికా ఆగ్రహానికి కారణం. ఇది వాణిజ్య వివాదం కాదు, భారత్ విదేశాంగ విధానాన్ని దెబ్బతీసే ప్రయత్నమని నిపుణులు అంటున్నారు. ఈ సుంకాల వల్ల భారత ఎగుమతులపై సుమారు 30 నుంచి 48 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సుంకాల దెబ్బ ముఖ్యంగా ఉపాధి ఎక్కువగా ఉండే రంగాలపై పడింది. జౌళి, దుస్తులు, తోలు, సముద్ర ఉత్పత్తులు, ఆటో విడిభాగాల పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలోకి జారుకున్నాయి.
దేశంలో నిట్‌వేర్ రాజధానిగా పేరున్న తిరుప్పూర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అమెరికా కొనుగోలు దారులు కోట్లాది రూపాయల ఆర్డర్లను రద్దు చేశారు. తిరుప్పూర్ నుంచి జరిగే ఎగుమతుల్లో 30 శాతం అమెరికాకే వెళ్తాయి. 5 నుంచి 8 శాతం లాభాలతో పనిచేసే ఎగుమతిదారులు 50 శాతం సుంకాన్ని తట్టుకోలేమని వాపోతున్నారు. బంగ్లాదేశ్, వియత్నాం లాంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి.. అమెరికాకు అవసరమైన జెనరిక్ మందుల్లో 40 శాతం భారత్ నుంచే వెళ్తాయి. అందుకే ఫార్మా రంగానికి ప్రస్తుతానికి సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇది భారత్‌పై దయతో తీసుకున్న నిర్ణయం కాదు. భారత మందులపై సుంకాలు విధిస్తే అమెరికాలోనే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరిగిపోతాయి. అయినా, భవిష్యత్తులో 250 శాతం వరకు సుంకాలు విధించే ప్రమాదం పొంచి ఉంది.. తోలు వస్తువుల ఎగుమతుల్లో 20 శాతం అమెరికాకే జరుగుతాయి.
ఆటో విడిభాగాలు, ఉక్కు, అల్యూమినియం, సముద్ర ఉత్పత్తుల రంగాలు కూడా తీవ్రంగా నష్టపోనున్నాయి.. ఈ సవాలును ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. తక్షణ చర్యగా, నష్టపోయిన ఎగుమతిదారులను, ముఖ్యంగా చిన్న పరిశ్రమలను ఆదుకోవడానికి ఆర్థిక ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. దౌత్యపరంగా అమెరికాపై ఒత్తిడి పెంచుతోంది. వాషింగ్టన్‌లో లాబీయింగ్ ముమ్మరం చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.. దీర్ఘకాలిక పరిష్కారంగా, అమెరికా మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్ నిర్ణయించింది.
ఇందులో భాగంగా యూకే, యూరోపియన్ యూనియన్ వంటి ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (FTA) వేగవంతం చేస్తోంది. ఇటీవలే యూకేతో కుదిరిన ఒప్పందం భారత జౌళి, తోలు పరిశ్రమలకు పెద్ద ఊరటనిస్తుంది. రష్యా నేతృత్వంలోని యురేషియన్ ఎకనామిక్ యూనియన్‌తోనూ చర్చలు ప్రారంభించింది.. ఈ సంక్షోభం భారత్‌కు పెద్ద సవాలే. కానీ, తన వాణిజ్య వ్యూహాన్ని మార్చుకుని, మరింత స్వయంప్రతిపత్తి సాధించడానికి ఇదొక అవకాశమని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి తీసుకునే చర్యలే దేశ భవిష్యత్ వాణిజ్య గతిని నిర్దేశిస్తాయి.

