మనిషి చనిపోయిన తరువాత చితిపెట్టేవాడు కొడుకు..పాడిమోసేవాళ్ళు ఆప్తులు.. కాటిదాకా వచ్చే వాళ్ళే బంధుమిత్రులు . అయితే కొన్నిదఫాలు ఎవరూ గుర్తించని ఓ మూగ నేస్తం కూడా కాటిదాకా వస్తుంది. కడతేరిపోయిన ఆప్తుడు లేదా యజమాని కోసం దీనంగా కన్నీరు పెడుతుంది. దాన్నెవరూ ఓదార్చరు. అదే విశ్వాసానికి మారుపేరైన శునకం. నెల్లూరు జిల్లా,పొదలకూరు పట్టణంలో ఓ శునకం చనిపోయిన తన యజమాని అంత్యక్రియలలో పాల్గొనడం చూసి తెలిసిన వారు నివ్వెర పోయారు.
తెలియని వారు అడ్డంవస్తోందని తరిమేస్తున్నా , అది కాటివరకు , శవయాత్రలోనే ఉండింది. స్థానికంగా మెయిన్ రోడ్డుపై నివసిస్తున్న కాసా చలపతి అనే వ్యక్తి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు. .ఆ విషయం ఆ శునకానికి తెలిసిందో ఏమో ప్రతి రోజు తనకి ఆహారంపెట్టి, తన బాగోగులు చూసే యజమాని మరణించడంతో దిగులు పడింది. అక్కడే ఉండిపోయింది. ఇదిగో చూడండి ఈ శునకం స్మశానం వరకు వచ్చి అతనిని పూడ్చి పెట్టె వరకు అక్కేడే ఉండి అతని కుటుంబ సభ్యులు, బంధువులు,తోటి మిత్రులను అందరిని ఆశ్చర్యపరిచింది…

