నిమ్మ మార్కెట్ లో నానాటికీ నిమ్మ ధరలు దిగజారుతున్నాయి. దీంతో గిట్టుబాటు లేక కొందరు రైతులు నిమ్మ కోతలు నిలిపేసి కాయలను చెట్లకే వదిలేస్తున్నారు. ఈ ఏడాది నిమ్మకాయలకు మంచి ధర వస్తే కూతురి పెళ్లికి.. కొడుకు చదువుకు కలిసి వస్తాయని ఆశపడ్డ నిమ్మ రైతులు సరైన ధర లేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం వరకు కాయ నాణ్యతను బట్టి బస్తా అయిదు నుంచి ఆరు వేల రూపాయల వరకు పలికిన ధర ప్రస్తుతం 800 నుంచి 1300 రూపాయల దాకా పలుకుతోంది.ఒక బస్తా నిమ్మకాయలు కోయడానికి, తోట నుంచి మార్కెట్ కు తరలించడానికి సుమారు 700 రూపాయలు దాకా ఖర్చవుతుంది.
కలువాయి మండలం చిన్న గోపవరం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే నిమ్మ రైతు మాట్లాడుతూ నిమ్మకాయలకు మార్కెట్ లో వచ్చిన డబ్బు కూలీలకు, ఆటో ఖర్చులకు సరిపోతుందని.. చేతిలో ఏమి మిగలడం లేదని వాపోయాడు. పొదలకూరు లెమన్ మర్చంట్ అసోసియేషన్ కార్యదర్శి అట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే అన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం తో పాటు అకాల వర్షాలు పడుతుండటంతో ధర బాగా తగ్గిందని తెలిపారు.
ఈ పరిస్థితి వల్ల రైతులతో పాటు వ్యాపారులు కూడా బాగా నష్టపోతున్నారని చెప్పారు. నిమ్మ రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని ప్రాంతాల్లో నిమ్మ సాగు విస్తీర్ణం పెరగడంతో రేటు తగ్గడానికి ఒక కారణమన్నారు. అలాగే మామిడి ధరలు తక్కువగా ఉండటంతో వివిధ ఫ్యాక్టరీలు మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నాయని, నిమ్మకాయల ధర తగ్గడానికి ఇది కూడా మరొక కారణమని వివరించాడు.

