సినీ హీరోయిన్లు కాజల్, తమన్నాకి క్రిప్టో కరెన్సీ కేసుతో సంబంధం ఏమిటి..? పాండిచ్చేరి పోలీసులు ఈ కేసులో వారిద్దరినీ విచారించాలని ఎందుకు నిర్ణయించారు.? ఇంతకీ ఈ విషయంలో లోగుట్టు ఏమిటో తెలుసా..? పాండిచ్చేరికి చెందిన ఒక క్రిప్టో కరెన్సీ ఆఫీసు ప్రారంభోత్సవానికి ఈ హీరోయిన్లు ఇద్దరూ హాజరయ్యారు. ప్రముఖ హీరోయిన్లు కూడా వచ్చారుకదా అని నమ్మి , తాను క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెట్టి మోసపోయానని ఆశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి కేసు దాఖలు చేసారు.

ఈ కంపెనీ పాండిచ్చేరిలోనే 10 మంది నుంచి రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేసింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెడితే లాభాలు బాగా వస్తాయని ఆశపడి డబ్బులు కట్టామని ఫిర్యాదీదారులు తెలిపారు. ఇద్దరు పెద్ద హీరోయిన్లు వచ్చి సంస్థ ఓపెనింగ్ లో పాల్గొన్నారూ అంటే , అది నమ్మకమైన కంపెనీ అని నమ్మామని తెలిపారు.

మహాబలిపురంలోని ఒక పెద్ద హోటల్లో క్రిప్టో కరెన్సీ నిర్వహించిన కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ వచ్చి ప్రమోట్ చేశారని చెప్పారు. ఆ తరువాత ముంబైలో పెట్టుబడులు సేకరించారని తెలిపారు. ఈ కేసులో అరవింద్ కుమార్, నితీష్ జైన్ అరెస్టయ్యారు. హీరోయిన్లు ఇద్దరికీ ఈ సంస్థతో సంబంధంపై వారిని విచారించాలని పోలీసులు నిర్ణయించారు.

