పోగొట్టుకున్న వస్తువులను యజమాని ఎవరో తెలియకపోయినా ,అవి దొరికిన వ్యక్తులు పోలీసులకు గాని ,ప్రభుత్వానికి కానీ అప్పగించడం అనేది పౌరుల నైతిక బాధ్యత . అయితే ఈ బాధ్యతను ప్రపంచంలో ఎన్ని దేశాలలో పౌరులు నూటికి నూరు శాతం అనుసరిస్తారు అన్నది ఆయా దేశాల్లో పౌరుల నైతికత, నిజాయితీ ,విధానాలు , నియమాలు మీద ఆధారపడి ఉంటుంది . ఒకప్పుడు ధర్మంపరిఢవిల్లిందని చెప్పే మనలాంటి దేశంలో కూడా 80శాతం పోగొట్టుకున్న వస్తువులను ఇచ్చే ఉదాత్త హృదయులు లేరు, దొరికింది ఎదో నొక్కేయడమే తెలిసిన వారు ఎక్కువమంది. చాలా కొద్ది శాతం మాత్రం పేదరికంలో ఉన్నప్పటికీ దొరికిన వస్తువులను జాగ్రత్తగా పోలీసులుకు అప్పజెప్పి నిజాయితీ చాటుకోవడం చూస్తూనే ఉన్నాం.
ప్రపంచంలో ఇలాంటి పోగొట్టుకున్న వస్తువులను మళ్లీ వెనక్కి తిరిగి ఇవ్వడం లేదా పోలీసులు అప్పగించే పనిలో మొట్టమొదటగా జపాన్ దేశం నిలుస్తుంది. జపాన్ లో పోగొట్టుకున్న వస్తువులు 80 శాతం మళ్ళీ పోలీసు వద్దకు లేదా ప్రభుత్వం వద్దకు చేరుతాయి. వాటిని ఒక అరలో ఉంచుతారు. అసలైన యజమానులు వచ్చి ఆధారాలు చూపించి తీసుకెళ్లొచ్చు. అంటే రైళ్లలోనూ ,బస్సుల్లోనూ, బస్టాండ్ లోనూ, రైల్వే స్టేషన్లలోనూ లేదా రోడ్లమీదను ఎవరైనా ,ఏదైనా వస్తువులు గాని డబ్బులు గాని ఇతరత్రా విలువైన వస్తువులను గాని పోగొట్టుకుంటే జపాన్ ప్రజలు వాటిని చూసిన వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అప్పగించి తమ అడ్రస్ కూడా ఇచ్చి పోతారు .
వస్తువులు పోగొట్టుకున్న వారు ఏ పోలీస్ స్టేషన్ ను సంప్రదించిన ఆ వస్తువు ఎక్కడ దొరికి ఉన్నా వెంటనే సమాచారం చేరవేస్తారు. ఇలాంటి ఒక అద్భుతమైన విధానం జపాన్లో అమల్లో ఉంది. జపాన్లో ఒక్క సంవత్సరంలోనే రూట్లో బస్సులోనో , బస్టాండ్ లోనో , లేదా రైల్వే స్టేషన్ లో , రైలులోనో పోగొట్టుకున్న నగదు 250 కోట్లకు రూపాయలు . ఈ మొత్తం డబ్బులు కూడా ఆ డబ్బులు దొరికిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఇచ్చి అసలైన యజమానులకు చేర్చిన సందర్భాలు ఉన్నాయి . 2023లో రెండు కోట్ల 70 లక్షల పోగొట్టుకున్న వస్తువులను యజమానులకు చేర్చారు. దీన్నిబట్టి జపాన్ లో వస్తువు పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ దొరుకుతుందని ,అది దొరికిన వారు మళ్ళీ తెచ్చిస్తారని గ్యారంటీ మాత్రం ఉంది. అలాంటి సంస్కృతి, సాంప్రదాయం మనదేశంలో ఎప్పుడు వస్తుందో..?

