కొన్ని జాతులు అంతరించి పోయాయనుకుంటాం , కానీ అవి ఎక్కడో ఒకచోట మానవులకు కనపడకుండా దట్టమైన కీకారణ్యాలలో ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు అవి కంటపడితే బ్రతికే ఉన్నాయని అనుకోవాల్సిందే. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉంటాయి. అలాంటిదే జగ్లాసుస్ అటెంబరో క్షీరదం. పిల్లలకు పాలిచ్చిపెంచే ఈ జంతువు , గుడ్లు పెడుతుంది. ఇలాంటి అరుదైన ప్రాణులు సృష్టిలో మరో రెండు మాత్రమే ఉన్నాయి. ఇది రాత్రి సమయాల్లో మాత్రమే వేటకు పోయి పగలంతా బొరియలలోనే కాలం గడుపుతుంది.
ఇండోనేషియాలోనో దట్టమైన అడవుల్లో ఈ ప్రాణిని ఇటీవలే కనుగొన్నారు. 61 సంవత్సరాల తరువాత ఈ ప్రాణిని కనుగొన్నారు. ఇటీవల వరకు అది అంతరించిపోయిందని భావిస్తూ వచ్చారు. ఇండోనేషియాలోని పర్వత ప్రాంతాల్లో పెట్టిన ఒక ట్రాప్ కెమెరాలో , జంతు శాస్త్రవేత్తలు ఒక్కసారిగా దీన్ని చూసి ఆనంద పడిపోయారు. 61 ఏళ్ళ తరువాత ఇది మళ్ళీ కనిపించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.ఇది ఎక్కువగా వానపాములను తింటుంది. తన పొడవైన ముక్కుతో వానపాములతోపాటు చీమలు, చెదలు కూడా తింటుంది. తన పొట్టకింద ఉన్న సంచిలో గుడ్లను పెట్టుకొని పొదుగుతుంది.

