మాజీముఖ్యమంత్రి జగన్ తన పంతం వీడక తప్పదా..? ప్రతిపక్ష ఇవ్వకపోతే అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయిన జగన్ ఇప్పుడు అసెంబ్లీకి రాక తప్పని పరిస్థితి. లేదంటే చట్టపరంగా ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోతాడు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా 60 సమావేశ దినాలు గైర్హాజరైతే, ఆ సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం సభకు ఉంటుంది. అంటే, జగన్ తన బహిష్కరణను ఇలాగే కొనసాగిస్తే, ఆయన తన శాసనసభ్యత్వానికే దూరం కావాల్సి వస్తుంది.
ఇది కేవలం ప్రతిపక్ష హోదా కోల్పోవడం కన్నా చాలా పెద్ద రాజకీయ నష్టం.. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనకుండా శాసన సభ కార్యదర్శి వద్ద హాజరైనట్టు అక్కడకు వచ్చి సంతకం పెడితే కూడా సరిపోతుందని చెబుతున్నారు. అయినా , తన పంతం వీడి అసెంబ్లీ ప్రాంగణానికి రావాల్సిందే.. లేదంటే శాసన సభ స్పీకర్ ఆయనను అనర్హుడుగా ప్రకటించవచ్చు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవి ఉంటే ఎంత , ఊడితే ఎంత అని అనుకుంటాడా..? ఒక వేళ ఆయనను అనర్హుడుగా ప్రకటించి , ఆ స్తానం ఖాళీ అయితే , మళ్ళీ పోటీ చేసి గెలిచినా ఆయనకు , ఆయన కోరుకునే ప్రతిపక్ష హోదా రాదు.
ఎందుకంటే 18 మంది ఎమ్మెల్యేల కంటే ఒక్కరు ఎక్కువ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో వేరేఎవరినైనా పెట్టి పోటీ చేయాలి. అప్పడు షర్మిల నేరుగా రంగంలోకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉంది. ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్ అంత ధైర్యం చేస్తాడా అన్నది వేచి చూడాల్సిన అంశం. ఇలా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక క్లిష్టమైన కూడలిలో నిలబడ్డారు. ఆయన ముందు రెండే దారులున్నాయి. ఒకటి పంతానికి ప్రతీక, మరొకటి పదవికి రక్ష. సెప్టెంబరు 18 న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న అవమానాన్ని దిగమింగి, పంతం వదులుకున్నట్టు అవుతుంది. హాజరు కాకపోతే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం పులివెందుల ఎమ్మెల్యే పదవికే ప్రమాదం వస్తుంది. ఈ రెండింటిలో ఆయన దేన్ని ఎంచుకుంటారన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ.
రాజకీయ పంతాలు, వ్యూహాలు పరిస్థితులను బట్టి మారవచ్చు. కానీ, రాజ్యాంగ నిబంధనలు శాశ్వతం. పంతం కోసం పదవిని పణంగా పెట్టడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశం. శాసనసభాపక్ష నేతగా సభకు దూరంగా ఉండటం, మిగిలిన పది మంది ఎమ్మెల్యేల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అసెంబ్లీ అనేది ప్రభుత్వ తప్పులను, విధానాలను అధికారికంగా ప్రశ్నించడానికి, ప్రజల వాణిని వినిపించడానికి ప్రతిపక్షానికి లభించే అతిపెద్ద వేదిక. దాన్ని వదులుకోవడం అంటే, ప్రత్యర్థికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టే.. అందువల్ల, జగన్ ముందున్నది సంక్లిష్టమైన ఎంపికే అయినా, అంతిమ నిర్ణయం స్పష్టంగానే కనిపిస్తోంది. పంతం కన్నా పదవిని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ఆయన మొగ్గు చూపే అవకాశం వుంది. ఆయన అసెంబ్లీకి తిరిగి రావడం అనివార్యం.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

