జగన్ సత్తెనపల్లి పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరి కారుకింద పది సింగయ్య చనిపోయాడో కూడా కనుక్కోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారా..? లేకపోతే నిజం దాచేసి కేసు పక్కదారిపట్టిస్తే గొడవలేకుండా పోతుందికదా ? అని అనుకున్నారా అన్న విషయం సస్పెన్స్ గా ఉంది. సోషల్ మీడియాలో సింగయ్య జగన్ కారుకింద పడి ఎలా మరణించాడో బయటకు వచ్చేదాకా దీని విషయం తెలియలేదు , దీన్ని బట్టి ఒక సంఘటన జరిగినప్పుడు పోలీసులు చేసే దర్యాప్తు ఎలా ఉందో ఇదే నిదర్శనంగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. సంబంధిత పోలీసులపై చర్యకు ఉపక్రమిస్తోంది.
ఈ వీడియో బయటకు రావడంతో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కారు నెంబర్ AP 40 DH 2349గా గుర్తించారు. A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్, A3గా కారు యజమానిని చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పేరిట ఈ కారుని కొనుగోలు చేసిన జగన్ OSD కృష్ణమోహన్‌రెడ్డి A3గా అయ్యారు. ప్రమాదం జరిగినరోజు 304A సెక్షన్‌పై కేసు నమోదు చేయగా ఇప్పుడు FIRలో అదనంగా 304 పార్ట్-2 సెక్షన్ చేర్చే అవకాశం ఉంది.
జగన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? అని నిలదీశారు. బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ? అని ప్రశ్నించారు. ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ? అని నిలదీశారు. ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా సింగయ్య మరణంపై ఎల్లో మీడియా క్షుద్ర రాజకీయాలుచేస్తోందని గుంటూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. వైయస్ జగన్ కాన్వాయి వాహనం వల్లే మృతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు వాహనం ఢీకొట్టిందని ఎస్పీ స్వయంగా చెప్పారని అయినా ప్రజలను తప్పదోవ పట్టించేలా ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోందన్నారు.

