దున్నపోతు ఈనిందంటే, దూడను గాటిలో కట్టేయమన్నాడట .. ఇది పాతకాలంనాటి సామెత. తెలివితక్కువ వాళ్ళగురించి, కుహనా మేధావుల గురించి చెప్పే సామెత ఇది. ఈ సామెత తరతరాలుగా వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో జరిగిన సంఘటన చూస్తే ఆ సామెత మాత్రం ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉండేది ప్రజలు సొమ్ము కదా ? ఎంత తింటే మనకేంటి అన్నట్టు ఓ స్కూలు పెయింటింగ్ వర్క్ లో ఎంత తిన్నారో తెలిస్తే మతిపోతుంది . ఎంత తిన్నారో సంగతి పక్కన పెడితే ఆ పెయింటింగ్ కోసం ఎంతమంది కూలీలను పనిచేసారో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది . ఇంతకీ అసలు విషయానికి వద్దాం .
రెండు స్కూల్స్ లో తలుపులకు పెయింటింగ్ వేయాలి. ఈ పెయింటింగ్ పని కోసం నాలుగు లీటర్లు పెయింట్ కొన్నట్టు పేర్కొన్నారు . పని పూర్తి అయిందని 3 లక్షల 38 వేలరూపాయలు రూపాయలు బిల్లు పెట్టారు ఇంతకీ ఈ డబ్బులతో జరిగిన పని కూడా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వివరించాలి కదా ..? అది ఎలా వివరించాడో చూడండి. నాలుగు లీటర్ల పెయింట్ తలుపులకు కొట్టేందుకు 68 మంది బేల్దారి మేస్త్రిలను పెట్టుకున్నానని బిల్లులు రాశారు. పెయింట్ పనికి బేల్దారి మేస్త్రి కి సంబంధం ఏంది అని అడగద్దు. అదంతే .
ఆ తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే ఈ నాలుగు లీటర్ల పెయింట్ వేసే దానికి 168 మంది కూలీలను పెట్టుకున్నారని మరో కహాని రాసేసాడు. చూశారుగా దొంగ బిల్లులు పెట్టినోడికి దొంగ తెలివి కూడా చాలా అద్భుతంగా ఉండాలి . ఎవరికీ చిక్కనట్టు, ఎంత శోధించిన దొరకనట్టు ఉండాలి తప్ప ఇలా పెయింట్ పనికి 68 మంది మేస్త్రీ పెట్టుకున్నాను అని, 168 మంది కూలీలను పెట్టించానని చెప్పుకోవడం విచిత్రంగా ఉంది. ఈ బిల్లు పెట్టిన వాడు నిజంగా మోసగాడా లేకపోతే తిక్కలోడా అన్నది అర్థం కాదు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనం అయింది. దీంతో జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణ కోసం రంగంలోకి దిగాడు.

