వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటన రద్దయింది. ప్రతిపాదిత హెలిప్యాడ్ ప్రాంతం అనువైనది కాకపోవడంతో జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని.. విమర్శలు చేశారు.
అయితే జగన్ పర్యటన వాయిదా పడటానికి అసలు కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. వెంకటాచలం మండలం, చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో హెలిప్యాడ్ కోసం పోలీసు అధికారులు స్థలం సూచించారు. ఆ స్థలాన్ని వైసీపీ నేతలందరూ వెళ్లి పరిశీలించారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా తాడేపల్లి ప్యాలస్ కు తెలియజేశారు.
పోలీసులు సూచించిన హెలిప్యాడ్ వద్దకు చేరుకునేందుకు కేవలం రెండు దారులు మాత్రమే ఉన్నాయి. పొదలకూరు రోడ్ మీద నుంచి ఓ దారి ఉండగా.. నేషనల్ హైవేపై నుంచి మరొక దారి ఉంది. ఈ హెలిప్యాడ్ వద్దకు చేరుకునేందుకు కేవలం ఈ రెండుదారులు మాత్రమే ఉన్నాయి. మరే దారిలోనూ హెలిపాడ్ వద్దకు చేరుకునేందుకు వీలులేదు. పోలీసులు కనుక ఆ రెండు దారులనూ బ్లాక్ చేస్తే.. వైసీపీ కార్యకర్తలు.. నేతలు ఎవరూ హెలిప్యాడ్ వద్దకు చేరుకునే అవకాశం లేదు. ఒకవేళ అలాగే జరిగితే.. వైసీపీ శ్రేణులు చేయాలనుకున్న జనసమీకరణ వృధాగా మారే అవకాశం ఉంది. మరో వైపు ఆ ప్రాంతంలో ఎక్కువగా నివాసాలు లేకపోవడం కూడా జగన్ పర్యటన రద్దు కావడానికి కారణంగా చెబుతున్నారు.
పరామర్శ కోసం వచ్చే జగన్ కు.. తాము సూచించిన ప్రాంతం అనువైనదేనని పోలీసులు గట్టిగానే చెబుతున్నారు. ఆ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ అయితే.. జగన్ నేరుగా జైలు వెనుక ప్రాంతంలో హెలికాప్టర్ దిగేసి.. అక్కడనుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి వెళ్లిపోవచ్చని అంటున్నారు. అయితే పోలీసులు చెప్పిన చోట హెలికాప్టర్ దిగితే.. ఎలాంటి రోడ్ షోకి కూడా అవకాశం లేకుండా పోతుందని.. ఇందుకే జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.

