ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ చల్లటి శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన విడుదల చేసింది. దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు వ్యాపించిన ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పింది.
ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ఈ నెల 13వ తేదీ నాటికి మరింత బలపడే అవకాశం ఉందని.. అల్పపీడనంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 13 నుండి 18 వరకు మన రాష్ట్రంలోని మధ్య, ఉత్తర భాగాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణతో పాటుగా మన రాష్ట్రంలో విజయవాడ-గోదావరి పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ, పశ్చిమ, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు వంటి మధ్య జిల్లాలలో వర్షాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

