అక్షరాలు ముత్యాల్లా ఉండాలంటారు అక్షరాలు గుండ్రంగా ముత్యాల మాదిరి చూసేందుకు అందంగా మరియు అర్థమయ్యేట్టుగా రాయాలని ఉద్దేశంలో గతంలో కాంపొజిషన్ అనే ఒక ప్రత్యేకమైన పుస్తకం పెట్టి దాంట్లో రాయించేవారు . ఓంకారానికి శ్రీకారం చుట్టినప్పుడే పలకపై అక్షరాల ముత్యాల్లా ఉండాలని గురువు తల్లిదండ్రులు దిద్దించేవారు .
అయితే ముత్యాలులాంటి అక్షరాలు కొంతమందికే సాధ్యం. కొంతమంది బ్రహ్మలిపి లాగా అర్థం కాకుండా రాస్తారు . మరి కొంతమంది కోడిగీతల మాదిరి రాసేస్తారు . ఇంకొంతమంది గొలుసు కట్టలా రాసేస్తారు . ఇలా చేతిరాతలో రకరకాల పద్ధతులు . అయితే నిజంగా ముత్యాలులాంటి అక్షరాలు ఎలా ఉంటాయో ఇదిగో ఈ పాపని చూడండి. చాలా చక్కగా, గుండ్రంగా ఎంతసేపు చూసినా చూడాలనిపించే చేతిరాత ఎలా ఉందో..?
నేపాల్ లో ఎనిమిదో తరగతి చదివే ప్రకృతి అని బాలిక ఈ చేతిరాత అద్భుతం. ఆమె క్లాస్ బుక్స్ లో కూడా ఏది రాసినా ముత్యాల సరాల్లాగనే కనిపిస్తాయి. అందుకే ఈ చేతిరాత ప్రపంచంలోనే అత్యుత్తమమైన చేతిరాతల్లో ఒకటని గిన్నిస్ బుక్ తన రికార్డ్స్ లో నమోదు చేసి ఆ పాపకు ప్రశంసాపత్రం పంపించింది. కంప్యూటర్ చేతిరాతలపై శ్రద్ధ కొరవడుతున్న వేళ.. ఇదిగో ఈ పాపను ఆదర్శంగా తీసుకొని అందమైన ముత్యాలసరాలు లాంటి చేతిరాతను నేర్పిస్తే బాగుంటుందేమో..?

