దేశవ్యాప్తంగా జిమ్ ట్రైనర్ల మోసాలు, మహిళలపై వేధింపులు, ప్రేమపేరుతో దగా పనులు ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. వాటికి కొసమెరుపుగా హైదరాబాద్ లో ఒక జిమ్ ట్రైనర్ , సినీ నటిని ప్రేమపేరుతో లోబరుచుకుని , గత ఐదేళ్లుగా సహజీవనం చేసి, ఆమెనుంచి లక్షల రూపాయలు డబ్బు కొట్టేసి జైలు పాలయ్యాడు. అతడు తనకు పెళ్లి కాలేదన్న అబద్దంతో తనకు దగ్గరయ్యాడని ఆ సినీ నటి చెబుతొంది. అతడికి పెళ్లయిందని ఇటీవలే తెలిసిందని, ఆ విషయం నిలదీసిఅడిగితే సమాధానం చెప్పకుండా బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జూబ్లీ హిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆమె కధనం ప్రకారం 2019లో గాయత్రీ హిల్స్ లో ఉన్న జిమ్ లో అతడు పరిచయం అయ్యాడు. తనకు పెళ్ళికాలేదని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దానితో పిజి హాస్టల్ నుంచి వచ్చేసి, మణికొండ, గాయత్రీ హిల్స్ తదితర ప్రాంతాలలో అద్దెకు తీసుకున్న ఇళ్లలో ఉన్నామన్నారు. పెళ్లి ప్రస్తావన చేస్తే వాయిదావేసేవాడన్నారు. ఆంధ్రలోని తమ తల్లితండ్రులకు కూడా తెలియదన్నారు.
ఇబ్బందుల్లో ఉన్నాననంటే , ఒక దఫా ఏడు లక్షలు డిజిటల్ ట్రాన్సక్షన్ ద్వారా డబ్బులు పంపానని , మళ్ళీ పలుదఫాలుగా 8 లక్షలు ఇచ్చానని చెప్పింది. అతడి మోసం బట్టబయలు అయిన తరువాత నిలదీస్తే తనను బెదిరించాడని చెప్పింది. పలుదఫాలుగా ఐదు లక్షలరూపాయాలే చెల్లించాడని , మిగిలిన డబ్బులు ఇవ్వనని చెప్పేసి బెదిరించాడని చెప్పింది..

