ఈ ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది . మనమే ప్రకృతి ఇచ్చిన వరాలను కనిపెట్టలేకపోతున్నాం. వాడుకోలేకపోతున్నాం. వాటిని నాశనం చేసుకుంటూ పోతున్నాం . ప్రకృతి ప్రసాదించిన ఈ గడ్డి చేమంతి మొక్క విశిష్టత గురించి పట్టణాల్లో కంటే పల్లె ప్రజలకే బాగా తెలుసు. అందులోనూ రైతులకు ఇంకా బాగా తెలుసు. పొలం గట్ల మీద కాలువ గట్ల మీద ,ఇంటి పెరట్లోనూ, చెరువు గట్ల మీద, ఇలా ఎక్కడబడితే అక్కడ పెరిగే గడ్డి చామంతి రైతులకు మేలు చేసేది.
పొలాల్లో పనులు చేస్తున్నప్పుడు కూలీలకు లేదా రైతులకు ఏదైనా గాయాలైనప్పుడు ఈ గడ్డి చేమంతి ఆకు రసం పిండి ఆ గాయంపై పోసేవారు . ఇలా చేస్తే రక్తస్రావం వెంటనే తగ్గేది . ఆ తర్వాత గాయం కూడా మానేది . అందుకే దీన్ని పురాతన కాలం నుంచి గాయపు ఆకు అంటారు. గాయపు ఆకు అంటే గాయాలు మానిపించేది. అనుభవాల ద్వారానే ఈ గడ్డి చేమంతి మొక్కను గాయపు మొక్క అని కూడా పిలిచేవారు. రైతులు అలా జరిగినప్పుడు గడ్డి చామంతి ఆకుల రసాన్ని గాయం మీద పోసిన వారే.
అయితే ఇటీవల కాలంలో ప్రకృతి వైద్యాన్ని మరిచిపోయారు . చిన్న జబ్బైనా పెద్ద జబ్బైనా డాక్టర్లు దగ్గరికి ,కార్పొరేట్ హాస్పిటల్స్ కు పరుగులు తీస్తున్నారు. దానికి కారణం మన ఆహార విహారాలలో వచ్చిన మార్పు . ఆ మార్పులు తెచ్చిన జబ్బులే కార్పొరేట్ హాస్పిటల్స్ ను, డాక్టర్లను బతికిస్తున్నాయి . ఈ ఆకుల్లోని రసాయనాలు మధుమేహ వ్యాధి నియంత్రణకు బాగా ఉపయోగపడతాయని ఇటీవల పరిశోధనలో తేలింది .
గడ్డిచేమంతి ఆకులు గుంటకలగరాకులు, నల్ల నువ్వులు, మూడు కలిపి నూనె చేసి దాన్ని కాచి వెంట్రుకల కుదుళ్లకు పట్టిస్తే వెంట్రుకలు పటిష్టంగా బలంగా తయారవుతాయని ఆరోగ్యకరంగా కూడా ఉంటాయని వైద్య పరిశోధనలు నిరూపిస్తున్నాయి . ఇలా ప్రకృతిలోని ప్రతి మొక్క ,ప్రతి చెట్టు ,ప్రతి కాయ ,ప్రతిపండు ,ప్రతి పువ్వు ఏదో ఒక రకంగా మానవాళి సంక్షేమానికి ఆరోగ్యానికి ఉపయోగపడేది. అయితే నేటి సాంకేతిక యుగంలో వీటిని మర్చిపోయి , ఆధునిక వైద్యం వైపు మనం పరుగులు తీస్తున్నాం .

