భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లో ఒక చర్చను మొదలుపెట్టింది. “ఆరోగ్య కారణాలు” అని రాజీనామా పేర్కొన్నప్పటికీ, దీని వెనుక బీజేపీ అధిష్టానం వైఖరితో విభేదాలు, రాజ్యాంగ పదవికి జరిగిన అవమానమే అసలు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.ఈ అనూహ్య పరిణామం ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక పెద్ద అంతర్గత తిరుగుబాటుకు సంకేతమంటూ, రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది.వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నిర్వహణ వ్యూహంలో భాగంగా, ఇద్దరు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించింది.
అయితే, రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ధన్‌ఖడ్, ఈ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా స్వతంత్ర వైఖరిని ప్రదర్శించారు. ముఖ్యంగా, జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన ప్రతిపాదనలో సాంకేతిక లోపాలున్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడమే కాకుండా, ఆ తీర్మానాలను సభలో లిస్ట్ చేయాలని పార్లమెంట్ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించారు. చైర్మన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం బీజేపీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ధన్‌ఖడ్ వైఖరికి ప్రతిగా, బీజేపీ తన అసంతృప్తిని పరోక్షంగా కానీ బలంగా కానీ తెలియజేసింది. పార్లమెంటరీ ఎజెండాను నిర్ణయించే కీలకమైన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (BAC) సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ గైర్హాజరయ్యారు.
చైర్మన్‌కు కనీస ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ చర్యను ధన్‌ఖడ్ తీవ్ర అవమానంగా, తన ఆత్మగౌరవానికి భంగంగా భావించారు. రాజ్యాంగబద్ధమైన తన విధులకు అడ్డుకట్ట వేయడాన్ని సహించలేక, మౌనంగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది.ఇటీవల గుండెకు స్టెంట్ వేయించు కున్నప్పటికీ, ఆయన చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, జైపూర్ పర్యటనకు కూడా సిద్ధమయ్యారని, కాబట్టి “ఆరోగ్య కారణం” అనేది గౌరవంగా తప్పుకోవడానికి చూపిన ఒక సాకు మాత్రమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.పదేళ్ల తర్వాత స్పష్టమైన మెజారిటీ లేకుండా, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ధన్‌ఖడ్ రాజీనామా ఒక గట్టి హెచ్చరిక లాంటిది. మెజారిటీ ఉంది కదా అని రాజ్యాంగ పదవులను, వాటి నిబంధనలను తేలికగా తీసుకోకూడదని, సంకీర్ణ ధర్మాన్ని, రాజ్యాంగ విలువలను గౌరవించాలని ఈ సంఘటన ఒక బలమైన సందేశం పంపింది.
బీజేపీ నియమించిన వ్యక్తే, ఆ పార్టీ వైఖరిని నిరసిస్తూ పదవిని త్యజించడం, ఒకరకంగా ఇది తీవ్రమైన అంతర్గత తిరుగుబాటుగానే పరిగణించాలి. ఒకప్పుడు ధన్‌ఖడ్ పక్షపాత వైఖరితో ఉన్నారని ఆయనపై అవిశ్వాసం ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు ఆయనను “విలువలకు కట్టుబడిన వ్యక్తి” అని ప్రశంసించడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ధన్ ఖడ్ రాజీనామా ఉపసంహరింపచేసే బాధ్యత ప్రధానమంత్రిదే అని కాంగ్రెస్ ఓపెన్ గా చేసిన విన్నపంలో “మీరు నియమించిన వ్యక్తినే మీరు ఒప్పించలేకపోతున్నారు” అనే దెప్పిపోటు కూడా వుంది. ప్రస్తుతం, ఎన్డీఏ ప్రభుత్వం ముందు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన తక్షణ సవాలు నిలిచింది.
“ఒకే దేశం, ఒకే ఎన్నికలు” వంటి కీలక బిల్లులను రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలంటే, సభను సమర్థవంతంగా నడిపించే చైర్మన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఎంపిక కోసం మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలతో విస్తృత సంప్రదింపులు జరపడం బీజేపీకి తప్పనిసరి. జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ ప్రస్థానం ఇక్కడితో ముగియదని, ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా జాట్ సామాజిక వర్గం రైతుల ప్రతినిధిగా ఆయన ఒక కొత్త రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలున్నాయని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన రాజీనామా భారత రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది, రాబోయే రోజుల్లో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి

