సీఎం కాన్వాయి అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. ఖరీదైన కొత్త కొత్త కార్లు.. అన్నిటికీ ఒకేరకమైన నెంబర్ ప్లేట్లు.. ఆ వాహనాలకు ముందు జామర్ వెహికల్.. పోలీసు సెక్యూరిటీ వాహనాలు.. వెనుక అంబులెన్సు.. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్.. ఇలా ఒకటా రెండా.. దాదాపుగా 20 వాహనాల వరకూ ఉంటాయి. సీఎం ఎక్కడికి వెళితే అక్కడకు ఈ వాహనాలన్నీ రావాల్సిందే.. పైగా సీఎం కాన్వాయ్ స్టార్ట్ అయితే రోడ్లన్నీ బ్లాక్ చేయాల్సిందే.. ఆయనకు దారి ఇవ్వాల్సిందే.. అది ప్రోటోకాల్ కూడా..
అయితే ఇలా జెట్ స్పీడ్ లో దూసుకెళ్లే సీఎం కాన్వాయ్ ఆగిపోతే, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును.. సరిగ్గా అలాంటి పరిస్థితే మధ్యప్రదేశ్ సీఎం కు అనుభవంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన కాన్వాయ్ ను సిద్ధం చేశారు. దారిలో వాహనాలకు ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఫ్యూయల్ కొట్టించుకున్నారు. అయితే అలా కొద్దిదూరం వెళ్ళగానే కాన్వాయ్ లోని వాహనాలన్నీ ఉన్నట్టుండి ఆగిపోయాయి. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలెర్ట్ అయిపోయారు. అసలేం జరిగిందో అర్ధంగాక పోవడంతో.. సీఎంను వాహనంలోనే ఉంచి ఎవరినీ దగ్గరకు రాకుండా సెక్యూరిటీ టైట్ చేశారు. హుటాహుటిన స్థానిక అధికారులు కూడా అక్కడకు చేరుకొని విచారించారు.
కొద్దిసేపటికి కొందరు అధికారులకు అనుమానం వచ్చి వాహనాల ఫ్యూయల్ ట్యాంక్ తెరచి చూడగా.. అందులో డీజిల్ బదులుగా నీళ్లు కనిపించాయి. అలా ఒకటికాదు.. రెండుకాదు.. దాదాపుగా 19 వాహనాల్లోనూ ఫ్యూయల్ ట్యాంకులో నీళ్లు కనిపించాయి. దీంతో పెట్రోల్ బంక్ వద్ద ఫ్యూయల్ కొట్టించిన విషయం గుర్తుకొచ్చింది. ఎక్కడ తప్పు జరిగిందో గ్రహించి వెంటనే ఆ పెట్రోల్ బంక్ కు చేరుకొని అక్కడ పెట్రోల్ ట్యాంకర్ ను పరిశీలించారు. అక్కడ పెట్రోల్, డీజిల్ ట్యాంకుల్లో దాదాపుగా సగంవరకూ నీళ్ళే కనిపించడంతో బంకును సీజ్ చేశారు. ఈలోగా సీఎం మోహన్ యాదవ్ కోసం ఇండోర్ నుంచి మరొక కాన్వాయి తీసుకొచ్చి పంపారు. అదీ సంగతి..!

