ఆగస్టు 15వ తేదీ రాబోతోంది. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి .ఈ సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోట వేదికగా జరిగే స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా ఉంటాయి. ప్రతి ఏడాది ప్రభుత్వం ఏదైనా, ప్రధానమంత్రి ఎవరైనా ఈ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. బహుశా ప్రపంచంలో, మన దేశంలో స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్న రీతిలో , అంత ఘనంగా మరే దేశమూ జరుపుకోదు.
స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు అంత ఉత్సాహం. అయితే ఈ ఏడాది స్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట మైదానంలోనూ, ఢిల్లీ లోనూ జరిగే భద్రతా ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉంటాయి. శత్రువుల చీమలు కూడా దూరలేనంత పకడ్బందీగా ఉంటాయి. అయితే ఈ ఏడాది భద్రత ఏర్పాటులో ఓ ప్రత్యేక విశేషం ఉంది. అదేమిటంటే ఈ వేడుకలు జరిగే ఎర్రకోట పరిసర ప్రాంతాలలోనూ, వేడుకలు జరిగే ప్రాంతంలోనూ ఎక్కడా కూడా చైనాకు సంబంధించిన సీసీ కెమెరాలు ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చైనా సంస్థల తయారు చేసిన ఈసీసీ కెమెరాలు ప్రైవేట్ వ్యక్తులవైనా, ప్రభుత్వానివైనా, మరి ఎవరివైనా సరే వాటిని తీసి వేరే కెమెరాలు పెట్టుకోవాల్సి ఉంది. ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేనని చెప్తూ అన్ని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికి ఒక కారణం ఉంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఇటీవల చైనా అండదండలతో, మద్దతుతో పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలు ఒక కారణమైతే, గూడ చర్య ప్రయోగాలలో చైనాను నమ్మలేమని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఈ కారణంగా చైనా తయారీ బ్రాండ్స్ అయిన సీసీ కెమెరాలు ఎర్రకోటలో కానీ ఎర్రకోట చుట్టుపక్కల కానీ నిషేధించారు. ఇది ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం భద్రతా ఏర్పాట్లులో విశేషం.

