హైవేలపై ప్రయాణం చేసే వారికి శుభవార్త.. ఎందుకంటే ఇక నుంచి హైవేలపై ప్రయాణించేటప్పుడు టోల్ గేట్ ల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ సరికొత్త విధానం ద్వారా ప్రయాణీకుల సమయంతో పాటుగా డబ్బు కూడా ఆదా కానుంది.
జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ మనం ఉపయోగిస్తున్న ఫాస్ట్ టాగ్ తో పాటుగా.. ఫాస్ట్ టాగ్ పాస్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగష్టు 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వాహనదారులు మూడువేల రూపాయలు చెల్లిస్తే ఈ పాస్ అందజేస్తారు. వీటిని ఉపయోగించి దేశంలో ఏ టోల్ ప్లాజా నుంచైనా ప్రయాణం చేయవచ్చు. ఈ పాస్ వివరాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు చెల్లుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఒకవేళ మనం 200 సార్లు టోల్ ప్లాజా దాటితే ఈ పాస్ వాలిడిటీ ముందుగానే పూర్తి అవుతుంది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ – కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ ద్వారా ప్రయోజనం లభించనుంది. ఈ కొత్త పాస్ యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్‌ను అందుబాటులోకి తెస్తామని గడ్కరీ చెప్పారు. ఎన్నోఏళ్లుగా వార్షిక పాస్ తీసుకురావాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి వినిపిస్తోందని.. అందుకే ఈ పాస్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పాస్ అందుబాటిలోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.

