చావు ,పుట్టుక ప్రతి ప్రాణికి సహజమైందే .అది సృష్టి సత్యం. అయితే చావు పుట్టుకలు మధ్య జీవితం ఒక్కో ప్రాణికి ఒక్కో రకంగా ఉంటుంది. సంతానం కోసం మనుషులే కాదు ముఖ్యంగా పక్షులు పడే ఆరాటం అద్భుతంగా ఉంటుంది. ఇదిగో ఈ ఎర్రమచ్చల బుల్బుల్ పిట్ట కట్టిన గూడు, ఆ గూటిలోని గుడ్లను చూడండి. బుల్బుల్ పిట్ట మెడ కింద మరియు తోక కింద ఎర్ర మచ్చలు ఉంటాయి. అలాగే ఇది పెట్టే గుడ్డులో కూడా పెంకుపై ఎర్రమచ్చలు కనిపిస్తాయి.
బుల్బుల్ పిట్ట దట్టమైన పొదల్లో, చెట్ల కొమ్మలు మధ్య గడ్డితోను పుల్లలతోనూ గూడు కడుతుంది. రెండు కొమ్మలకు అటు ఇటు పుల్లల ఆధారం చేర్చి దాన్ని మరో రెండు కొమ్మలకు కలిపి ఇలా కట్టే గూడు ఆ బుల్లి పక్షులు మేధస్సుకు, నైపుణ్యానికి నిదర్శనం. సాధారణంగా జూన్ నెలలోపలే ఈ పక్షులు గుడ్లు పెట్టేసి పొదిగేస్తాయి. వీటి పొదుగుకు గరిష్టంగా 15 రోజులు సమయం పడుతుంది.
విచిత్రం ఏంటంటే బుల్బుల్ పెట్ట పొదిగిన తర్వాత ఆ పిల్లలు 10 నుంచి 14 రోజులలోపు గూడు వదిలి సొంతంగా బ్రతకడానికి వెళ్ళిపోతాయి. బుల్బుల్ పిట్ట పది నుంచి 12 సంవత్సరాలు వరకు బ్రతకగలదు. మనదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని అడవుల్లో చెట్ల పొదల్లో బుల్బుల్ పిట్టలు ఉంటాయి. పేరుకు తగ్గట్టే వాటి కూతగాని, వాటి రూపంగానీ చాలా బాగుంటాయి. ఉదయగిరి కొండల్లో, అడవుల్లో బుల్ బుల్ పిట్టలు ఎక్కువగా ఉన్నాయి.

