మతం మారిన తరువాత కూడా అంతకు ముందు కులంతో హక్కులు, సౌకర్యాలు పొందాలనుకుంటే చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం పుచ్చుకొని , మళ్ళీ తనకు ఎస్సీ జాబితాలోనే రిజర్వేషన్, ఇతర ప్రయోజనాలు కావాలంటే వీలుకాదని , ఇది రాజ్యాంగాన్ని , రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మోసం చేయడమేనని పేర్కొంది. క్రైస్తవ మతం పుచ్చుకున్న తరువాత , అతడు క్రైస్తవుడేనని , అంతకు ముందు కులం వర్తించదని చెప్పింది. ఏ రోజు అయితే మతం మారుతారో ఆ రోజే ఇంతకుముందు ఉన్న అవకాశాలు, హక్కులు కోల్పోతారని తెలిపింది.
పిట్టలవారిపాలెం , కొత్తపల్లికి చెందిన చర్చి పాస్టర్ ఆనంద్ , గ్రామంలోని అగ్రకులాలకు చెందిన ఐదుగురిపై ఎస్సీఎస్టీ చట్టంకింద కేసు నమోదు చేసారు. తనను కులంపేరుతో దూషించారని అందులో పేర్కొన్నారు. తానూ ఎస్సీ కులానికి చెందిన వాడినని కూడా పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఉంది. దీన్ని కొట్టివేయాలని రామిరెడ్డి అనే నిందితుడు హైకోర్టులో పిటీషన్ వేశారు.
దీన్ని విచారించిన హైకోర్టు, క్రెస్తవ మతంలోకి మారిన తరువాత , చర్చి పాస్టర్ ఆనంద్ కి తాని ఎస్సీ నని చెప్పుకునే హక్కులేదని స్పష్టం చేసింది. ఎస్సీ ముసుగులో చర్చి పాస్టర్ ఆనంద్ చేసిన ఆరోపణచెల్లదని, ఎస్సీఎస్టీ చట్టంకింద పెట్టిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తెలిపింది. పోలీసులు కూడా ఈ విషయంలో తొందరపడ్డారని , కేసు నమోదు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది.

