తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. చెక్ పాయింట్ వద్ద బైక్ ను ఆపకుండా తప్పించుకుని తిరుమల వెపు దూసుకెళ్లాడు . అమీర్ అంజాద్ ఖాన్ అనే వ్యక్తి చేసిన ఈ పని సంచలనం కలిగించింది. అతన్ని నిలువరించేందుకు భద్రతా సిబ్బంది చాలా ప్రయత్నించారు. కానీ అతను వేగంగా దూసుకెళ్లాడు. అంతేకాకుండా ఘాట్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్ తో వెళ్లడంతో పలు వాహనాలను ఢీకొట్టాడు అంజాద్ ఖాన్. అతన్ని జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలిపిరి నుంచి తిరుమల వరకు ఓ సాధారణ వ్యక్తి తన బైక్ పై వెళ్తుంటే అతన్ని అదుపులోకి తీసుకునే వ్యవస్థ టీటీడీ వద్ద లేకపోవడం తిరుమలలో ఉన్న భద్రతా డొల్లాతనాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకులు జరుగుతున్న టైమ్ లో ఓ అన్యమతస్థుడు తిరుమల వైపు దూసుకెళ్లడం వెనుక ఏమైనా కారణం ఉందా అనేది విజిలెన్స్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడి మానసికపరిస్థితిపై విచారిస్తున్నారు.

