కాశ్మీర్ లోని పెహల్ గావ్ లో ఉగ్రవాదుల ఉన్మాద హత్యాకాండను అడ్డుకోబోయిన సయ్యద్ అదిల్ హుస్సేన్ తండ్రి తన కుమారుడు వీరుడు, అమరుడని ఆనందబాష్పాలు రాల్చాడు. పేద కుటుంబానికి అండగా ఉన్న అదిల్ , పర్యాటకులను గుర్రం మీద తిప్పి కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఆ రోజు కూడా పర్యాటకులను గుర్రం మీద కొండల అందాలను చూపిస్తున్నాడు. తీవ్రవాదులు తుపాకులతో ముందుకొస్తూ , పర్యాటకులను టార్గెట్ చేస్తుండగా , అదిల్ వెంటనే ఒక తీవ్రవాదినుంచి తుపాకీ లాక్కొనే ప్రయత్నం చేసాడు.
బహుశా అతని ప్రయత్నం ఫలించి ఉంటే , మిగిలిన ముగ్గురు తీవ్రవాదులను అతనే చంపి ఉండేవాడేమో..? అయితే అదిల్ ప్రయత్నాన్ని పసిగట్టిన తీవ్రవాది , వెంటనే అతడిని కాల్చి చంపేశాడు. అదిల్ అంత్యక్రియలకు ఒమర్ అబ్దుల్లా కూడా వచ్చారు. ఈ సందర్భంగా అదిల్ తండ్రి మాట్లాడుతూ , తన కొడుకు, పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో అమరుడయ్యాడని , దేశం కోసం చనిపోయినందుకు తాను గర్విస్తున్నానని చెప్పాడు. కాశ్మీర్ లో తీవ్రవాదులను అంతం చేయాలన్నదే తన పంతమని కూడా చెప్పారు.

