కాశ్మీర్ లోని పెహల్ గామ్ లో జరిగిన తీవ్రవాద ఉన్మాద మారణకాండ వెనక పాకిస్తాన్ హస్తం ప్రత్యక్షంగా ఉందని భారతీయ ఇంటెలిజెన్స్ అధికారులు సూత్రప్రాయంగా నిర్ధారించారు. ఈ ఉన్మాద మారణకాండలో కీలకంగా పాల్గొన్న హషీమ్ మూసా ఇదివరకు పాకిస్తాన్ పారా మిలటరీలో పనిచేశారు .తీవ్రవాద కార్యకలాపాల్లో వివిధ రంగాల్లో శిక్షణ పొందారు . ఆయనను భారతదేశంలో తీవ్రవాద కార్యక్రమాల కోసం తాత్కాలికంగా విధుల నుంచి తప్పించి ఆ తర్వాత తీవ్రవాద శిక్షణ ఇచ్చారు.
కొండలెక్కడం, రోజుల తరబడి బ్యాగ్ లో దాచుకున్న ఆహార పదార్థాన్ని తిని బతకడం, కాల్పుల్లో నైపుణ్యం ,గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ .. ఇలా అనేక రకాలుగా మూసాకూ శిక్షణ ఇచ్చి ఈ మారణకాండ కోసం ప్రత్యేక కార్యక్రమం పై కాశ్మీర్ కి పంపించారు . మూసా దాదాపు 18 రోజులు పాకిస్తాన్ నుంచి కొండల్లో , అడవుల్లో ప్రయాణం చేసి పెహల్ గామ్ చేరుకున్నారు . ఇదివరకే అక్కడ ఉన్న ఇద్దరు పాక్ టెర్రరిస్టులు , మరొక స్థానిక ఉగ్రవాదితో కలిసి మారణకాండ సృష్టించారు. ఇదంతా పాకిస్తాన్ ప్రభుత్వం ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే చేశారని స్పష్టమవుతుంది . మూసా పాకిస్తాన్ పారామిలిటరీ లో పెరేడ్ చేస్తున్న ఫోటోలు కూడా సంపాదించారు.

