వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఇప్పుడు ఊపందుకుంది. జగన్ హయాంలో నత్తనడక నడిచి అనేక మలుపులు తిరిగి చివరకు అయోమయం కలిగించిన ఈ కేసులో ఇప్పుడు సాక్షుల మరణాలపై విచారణ మొదలైంది. సినిమా ఫక్కీలో ఈ హత్య కేసులో కీలక సాక్షులు అంతుబట్టని విధంగా చనిపోతున్నారు. దీంతో సిబిఐ దీనిని ఛాలెంజ్ గా తీసుకుంది. సాక్షుల మరణాలపై సిట్ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు మరణించిన ఆరుగురు సాక్షుల , మెడికల్ రిపోర్ట్స్, వాళ్ళ ఇళ్లలో వారి సాక్ష్యాలు సిట్ బృందం సేకరిస్తోంది.
ఇందులో భాగంగా వాచ్ మెన్ రంగన్న మరణంపై ఆయన భార్యను విచారిస్తోంది. పరమేశ్వరరెడ్డిని లింగాల పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. మరో సాక్షి శ్రీనివాసరెడ్డి మరణం విషయంలోనే పరమేశ్వరరెడ్డిని విచారిస్తున్నారు. ఇదే కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి , సిబిఐకి చిక్కకుండా నానా తంటాలుపడి బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి మాత్రం ఈ కేసులోనే అరెస్టైన విషయమూ తెలిసిందే.. మొత్తం మీద వైఎస్ వివేకా హత్యకేసు ఒక వీడని చిక్కుముడిలా , అంతుపట్టని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాగే ఉంది. సమీప భవిష్యత్తులో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు..

