తిరుమల తిరుపతి దేవాయలయం కొన్ని వేల సంవత్సరాలనుంచి ఉన్నదే.. అయితే చరిత్ర ఆధారాలప్రకారం 12 వందల ఏళ్లుగా శాసనాలు, లిపి , గ్రంధాలు ఉన్నాయి. ఏనాడూ తిరుమల దేవాలయాన్ని వివాదం చేయలేదు. వివాదాల్లోకి లాగలేదు. ముస్లిం, బ్రిటిష్ పాలనలోకూడా తిరుమల వివాదాల్లో లేదు.. అయితే చరిత్రలో తిరుమలను రాజకీయాల రొచ్చులోకి లాగిన నీచమైన చరిత్ర గత ఆరేళ్లుగా జరుగుతొంది. తిలాపాపం తిలా పిడికెడు అన్నట్టు , తిరుమలను రాజకీయ స్వార్ధానికి బ్రష్టు పట్టిస్తున్నారు. ఆలయం ముందే రాజకీయ విమర్శలు, తిట్లు, శాపనార్ధాలతో ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాలకు ఆలయ ప్రతిష్టను మంట గలుపుతున్నారు. భక్తుల సహనం ,మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విధానం.. తిరుమలలో అన్య మత ఉద్యోగులు ధోరణులు , ప్రచారాలు ఎవరూ కాదనలేని నిజం.. అయినా ఎవరూ పట్టించుకోరు. ఇదే వేరే మతసంస్థల్లో అనుమతిస్తారా అన్న భక్తుల ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి, దుస్థితి.. తిరుమలలో సిఫార్సుల సంస్కృతి అవధులు దాటింది. తిరుమలలో ప్రతిదాన్నీ రాజకీయం చేయాలని చూడటం సాధారణమైపోయింది. ఇప్పుడు నోరులేని గోవులను అడ్డంపెట్టుకొని చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే మరీ ఏవగింపు కలుగుతొంది. ఈ నీచ , నికృష్ట సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది.

