వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. పెద్ద వాళ్ళతో కూడిన వ్యవహారం కావడంతో ఎవరూ ఈ కేసు విషయంలో నోరు మెదపడం లేదు. ఇప్పటికే వివేకా హత్యకేసులో సాక్షులైన నలుగురు చనిపోయారు. తాజాగా వివేకా ఇంటి వాచ్ మ్యాన్ రంగయ్య కూడా మరణించాడు. దీంతో కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎలాగైనా ఈ కేసు మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగారు.
వివేకా హత్యకేసులో సాక్షులుగా ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి, గంగాధర రెడ్డి కొద్దిరోజుల క్రితమే మరణించారు. వీరిద్దరికీ పెద్దగా ఆరోగ్య సమస్యలు కూడా లేవు. మరో సాక్షి శ్రీనివాసులు రెడ్డి మరణం కూడా అప్పట్లో మిస్టరీగా మారింది. అయితే వివేకా హత్య కేసులో వరసగా నలుగురు సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సాక్షులు నలుగురూ ఒకే కారణంతో చనిపోయారని పేర్కొన్నారు. సాక్షులు చనిపోవడానికి వెనకున్న కారణాలను గుర్తిస్తామని.. ఈ మరణాలన్నిటిపైనా సైంటిఫిక్ గా విచారణ చేస్తామని తెలిపారు.

