తేలుకొండికాయలు.. పల్లెల్లో మొన్నటి తరం చూసిన కాయలు. పట్టణాల్లో అయితే ఈ కాయలు చూపిస్తే , అవేదో పురుగులు అనుకుంటారు. కానీ అరుదైన ఈ కాయలు, మొక్కలు ఇప్పుడు కనుమరుగు అవుతున్నాయి. పల్లెల్లో ఒకప్పుడు కాలువగట్లు మీద ఉండే ఈ కాయల చెట్లు ఇప్పుడు లేవు. ఇంగ్లిష్ లో వీటిని బ్యాట్ హెడ్ రూట్స్ అంటారు. అంటే గబ్బిలాల తల వేర్లు” అని పిలుస్తారు. ఈ కాయలు గబ్బిలం తలలాగా ఉంటుందని ఆలాపిలుస్తారు.
ఇవి పార్విఫ్లోరా మొక్క యొక్క ఎండిన విత్తన కాయలు , వీటికి పురాతనకాలంనుంచి ఆధ్యాత్మిక, పూజాకార్యక్రమాల్లో ప్రత్యేకత ఉంది. చెడు నుండి రక్షణ కోసం, , ప్రతికూల శక్తులను ఆపడానికి మరియు కోరికలు తీరేందుకు మరియు అదృష్టం కోసం వివిధ వర్గాలలో వీటిని వాడుతారు.ఇవి ఇంటికి కట్టుకుంటే ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సుతో కూడిన మంచి జరుగుతుందని భావిస్తారు. దుష్ట శక్తుల ప్రభావాన్ని దూరం చేస్తాయని చెబుతారు. ఈ కాయలను ఎక్కువగా వరలక్ష్మి వ్రతంలో వాడుతారు. గతంలో అనేక రకాలైన పూజలలో తప్పకుండా వాడేవారు.
అయితే పూజావిధానంకూడా వ్యాపారాత్మకం అయిపోవడం, ఆడంబరాలకు ఆలవాలం కావడంతో నిజమైన సంప్రదాయం కనుమరుగుఅవుతూ వస్తోంది. గిరిజన తెగలు ఈ కాయలతో ఔషదాలు తయారుచేస్తారు. ఆయుర్వేదంలో కూడా ఈ కాయలను , ఆకులను, పూలను వాడుతారు. కాయలు ముదురు రంగులో ఉంటాయి మరియు గబ్బిలం తలను పోలి ఉండే ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. వాటి రూపం మరియు రక్షణ లక్షణాల కారణంగా వాటిని కొన్నిసార్లు దెయ్యపు కాయలుగా, గబ్బిలం కాయలుగా పిలుస్తారు. ఇవి ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలోనే దొరుకుతాయి..

