ఎన్టీఆర్ జిల్లాలో ఇన్స్టాగ్రామ్ సంబంధం పేరిట మహిళ నయవంచనకు పాల్పడింది. వధువుకు బంగారం కొనాలంటూ 45 లక్షల రూపాయలకు టోకరా వేసింది. అక్రమ సంపాదన కోసం విద్యాధికురాలైన మహిళ, ఓ కుటుంబాన్ని నయవంచనకు గురి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు తెలిపిన వివరాల మేరకు సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా పని చేస్తున్న ఈడేపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి కొద్దికాలం కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో అందంగా ఉన్న యువకుడి ఫొటో చూసి అతడిని అల్లుడిగా చేసుకోవాలని భావించాడు.. ఇన్‌స్టాగ్రాంలో ఉన్న నంబరుకు ఫోన్ చేస్తే ఒక మహిళ ఫోన్ ఎత్తి మాట్లాడింది.. తాను ఆ యువకుడి తల్లినంటూ తనను తాను పరిచయం చేసుకుని నమ్మించింది. .ఆమె కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని వ్యక్తి కోరడం, అందుకు సదరు మహిళ సైతం సానుకూలంగా స్పందించడంతో వాట్సాప్ ద్వారా ఇరువురి కుటుంబాలకు చెందిన పూర్తి వివరాలన్నీ ఒకరికొకరు పంచుకున్నారు..
ఆ యువకుడితో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం కట్నకానుకలు, ఇతర లాంఛనాల గురించి ఇరువురి కుటుంబాలు కాసేపు మాట్లాడుకున్నారు.
కొద్దిరోజుల కిందట ఆమె ఫోన్ చేసి వివాహం నిమిత్తం తన కుమారుడు దిల్లీలో దాదాపు రూ.కోటి విలువ చేసే బంగారు నగలు కొనుగోలు చేస్తున్నాడని, వధువు తరఫున .50 లక్షలను పంపాల్సిందిగా ఆ మహిళ పెళ్లికూతురు తల్లిదండ్రులను కోరింది.. అనంతరం ప్రత్యక్షంగా ఒకరికొకరికి ఎటువంటి ముఖ పరిచయం లేకపోయినప్పటికీ ఏ మాత్రం అనుమానం లేకుండా వారు .45 లక్షలు ఆమె చెప్పిన ఖాతాకు వెంటనే జమ చేశారు..అనంతరం తాము డబ్బులను బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు చెప్పేందుకు పెళ్లికూతురు తరఫు వారు ఫోన్ చేస్తే ఛార్జింగ్ తక్కువగా ఉందంటూ ఆమె సమాధానం చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు చివరికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎట్టకేలకు ఆమె ఆచూకీ గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తున్నట్లు తెలిసింది. బీటెక్ చదివి ఉద్యోగం చేసుకుంటున్న సదరు మహిళకు మగ సంతానమే లేదనీ, ఇద్దరు చిన్న కుమార్తెలు మాత్రమే ఉన్నారనీ తెలిసింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితోనే తప్పుడు సమాచారంతో సామాజిక మాధ్యమం ద్వారా బాధితులకు వల వేసి రూ.లక్షలు దోచేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది..

