కొన్ని విషయాల్లో చైనా ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. మిగతా ప్రపంచ దేశాల కంటే పరిశోధన ,పరిశీలన, ప్రయోగాలు ,ఆచరణాత్మకంగా వాటిని ముందుకు తీసుకుపోయే విషయాల్లో చైనా ధైర్యంగానే ముందడుగు వేస్తుంది. మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా తనకు తానుగా రూపొందించుకున్న టెక్నాలజీతో చైనా సాధిస్తున్న సాంకేతిక విజయాలు మిగిలిన దేశాలు కంటే ముందంజలో ఉంటాయన్నది వాస్తవం . డిజిటల్ పేమెంట్స్ విషయంలో యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టింది కూడా చైనా దేశమే . ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పామ్ పేమెంట్స్ అనే సిస్టం తీసుకొచ్చింది.
పామ్ పేమెంట్ అంటే అరచేతిని స్కాన్ చేసి పేమెంట్ చేయడం అన్నమాట . అరచేతిలో నరాలను ఒకసారి స్కాన్ చేసి భద్రపరిచి దాంతోనే ఎక్కడైనా డిజిటల్ పేమెంట్లు చేసే విధానం ఈ పామ్ పేమెంట్ విధానం. స్కానర్లు, పాస్ వర్డ్స్, కోడ్ నంబర్స్, యుపిఐ నెంబర్లు, సీక్రెట్ నెంబర్స్ ఇవన్నీ ఏవి లేకుండా కేవలం ఆ వ్యక్తి అరచేతి సూచికలతోనే ఈ పేమెంట్లు జరిగిపోతాయి . ఈ విధానం వల్ల ఆన్లైన్ పేమెంట్లలో మోసం జరగదని పాస్ వర్డ్స్ చోరీ చేసి లేదా ఆన్లైన్లో వాటిని ట్రాక్ చేసి కనుగొనే విధానం దీంట్లో అసలు ఉండదని చైనా తేల్చి చెప్పేసింది .
ప్రస్తుతానికి ఈ పేమెంట్ ల విధానాన్ని బీజింగ్ విమానాశ్రయంలోనూ ,ఎక్స్ప్రెస్ ట్రైన్ లోను , షాంగ్జెన్ యూనివర్సిటీ ప్రాంతంలోనూ ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది . ఇది ఎటువంటి లోపాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా విజయవంతంగా కొనసాగుతుందని ప్రకటించింది. దీనిలో డేటా చోరీ చేసే అవకాశం కూడా లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డేటా సెంటర్లోనే భద్రంగా ఉంటుందని ,ఇది వేరే వ్యక్తుల చేతికి పోయే సమస్య లేదని కూడా తేల్చి చెప్పేసింది. పాస్ వర్డ్స్ మరిచిపోవడం , రికవరీ ఆప్షన్స్ , ఆన్ లైన్ స్కామర్లు , ఇలాంటి భయాలులేని విధానమని తెలిపింది. దీనిపై ఎన్ని రకాల అనుమానాలు అపోహలు వచ్చినప్పటికీ చైనా మాత్రం ఇది అత్యంత భద్రమైన సురక్షితమైన పేమెంట్ విధానమని చెబుతోంది.

