బిడ్డలన్న తర్వాత అల్లరి చేయకుండా ఉండరు . అది ఇంట్లో అయినా, బస్సులో అయినా ,కారులో అయినా, విమానంలో అయినా, తల్లి ఒడిలో అయినా, అల్లరి చేయడం బిడ్డల నైజం . దాన్ని భరించడం పెద్దవారి గుణం. అయితే అందరూ ఒకేలా ఉండరు . ఒక్కో దఫా విమానాల్లో పసిబిడ్డలు చేసే అల్లరి లేదా ఏడుపు సహ ప్రయాణికులకు ఇబ్బంది కరంగా ఉండొచ్చు . అది కూడా ఎక్కువ సమయం విమానాల్లో గమ్యం చేరుకునే ప్రయాణికులకు కొంత అసహనంగా కూడా అనిపించవచ్చు. అందుకే ఓ తల్లి తనలోని తల్లి ప్రేమను రంగరించి , తన బిడ్డ చేసే అల్లరిని భరించండి అన్న అర్ధం వచ్చేట్టు ప్రయాణికులకు విచిత్రంగా విన్నపం చేసుకుంది .
అదేంటంటే బిడ్డతో సహా విమానంలోకి ఎక్కడంతోనే తన వద్ద ఉన్న 200 ప్యాకెట్లను విమాన ప్రయాణికులు అందరికీ పంపిణీ చేసింది . ఇంతకీ ఈ ప్యాకెట్లలో ఏమున్నాయో తెలుసా? బిడ్డ ఏడిస్తే లేదా అల్లరి చేస్తే కాస్త క్షమించి ఓపిక పట్టమని చెప్పలేక ఈ ప్యాకెట్ ఇచ్చింది . ఈ పాకెట్ లో ఇయర్ ప్లగ్స్, స్వీట్స్, చూయింగ్ గమ్స్ ఉన్నాయి. బిడ్డ అల్లరి ఎక్కువైనప్పుడు భరించలేక చెవుల్లో పెట్టుకునేందుకు ఇయర్ ప్లగ్స్,, బోరుకొట్టకుండా తినేందుకు స్వీట్స్ , చూయింగ్ గమ్స్ ఇలా రకరకాల తినుబండారాలు కూడా ఉంచి ప్యాసింజర్లకు ఇచ్చింది . దీని అర్థం తన బిడ్డ ఏడుస్తున్న, అల్లరి చేస్తున్నా కాస్తంత భరించమని వారిని కోరుకోవడం అన్నమాట .
దక్షిణ కొరియాకు చెందిన యువతి సీయోల్ నుంచి అమెరికాకు పోతోంది . 10 గంటల సుదీర్ఘకాలం ఈ ప్రయాణంలో ఆమె నాలుగు నెలల బిడ్డను తీసుకుపోతోంది . అందువల్ల ఈ 10 గంటల్లో బిడ్డ అల్లరి చేయకుండా ,ఏడవకుండా ఉండడు . అందుకే ముందు జాగ్రత్తగా ప్రయాణికులు అందరికీ ఈ ఇయర్ ప్లగ్స్,, స్వీట్లు ఇచ్చి మంచి చేసుకుంది. ఆ తల్లి ప్రేమను ఆ తల్లి ప్రేమలో చమత్కారాన్ని ప్రయాణికులు నిజంగా ప్రశంసించారు. తల్లి ప్రేమలో ఎంత గొప్పదనం ఉందో, క్షమించమని అడగడం కూడా ఎంత చమత్కారంగా ,ఎంత వినయంగా ,ఎంత ప్రేమగా అడిగిందో ఈ ఒక్క సంఘటనే ఉదాహరణ . అందుకనే తల్లి ప్రేమను వర్ణించడానికి మాటలు లేవు, మాటలు రావు అంటారు కవులు . ఈ తల్లిని చూసిన తర్వాత బహుశా అది నిజమేనేమో అనిపిస్తుంది.

