వీఐపీ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఎంపీ కొడుకునని, న్యూరో సర్జన్‌నని నమ్మించి వంచనకు పాల్పడటం, అమ్మాయిలను వలలో వేసుకొని , వారినుంచి డబ్బులు కొట్టేసి , వారిని వాడుకుని వదిలేయడమే వీడి పని. చివరకు ఈ వైట్ కలర్ నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు గా గుర్తించారు. 29 ఏళ్ళ వయసున్న ఇతను డాక్టర్ విక్రాంత్ రెడ్డి అనే నకిలీ పేరుతో ఈ మోసాలు చేస్తున్నాడు. కేపీహెచ్‌బీలోని సితార ఉమెన్స్ పీజీ హాస్టల్ నడుపుతున్న ఒక మహిళను నిందితుడు వలలో వేసుకుని మోసం చేశాడు.
తన బంధువులు, జూనియర్లను హాస్టల్‌లో చేర్పించే నెపంతో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు..తాను జూబ్లీహిల్స్‌లో జ్యువెలరీ షాపు నడుపుతున్నానని నమ్మించి, ఆమె బంగారు గొలుసును రీమోడలింగ్ చేస్తానని తీసుకున్నాడు.రీమోడలింగ్ కోసం మరింత బంగారం అవసరమని చెప్పి, ఆమె నుంచి ఆన్‌లైన్‌లో 55 వేలరూపాయలు ఒకసారి, 45 వేలరూపాయలు మరోసారి నగదు తీసుకున్నాడు. మొత్తం లక్ష రూపాయలతో పాటు తో పాటు, 4 తులాల బంగారు గొలుసు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు,.
నిందితుడు వెంకటేశ్వర్లు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 14 కేసులు నమోదయ్యాయి, బాలానగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు, కూకట్‌పల్లి ఏసీపీ ఇ. రవి కిరణ్ రెడ్డి పర్యవేక్షణలో కేపీహెచ్‌బీ పోలీసులు జేఎన్‌టీయూహెచ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..

